గుంటూరు: ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ శాఖలన్నింటిలోని ఖాళీలను ఇప్పటికే వైసిపి కార్యకర్తలతో భర్తీ చేశారని టిడిపి నాయకులు నాదెండ్ల బ్రహ్మం ఆరోపించారు.  ఇప్పుడు ఔట్ సోర్సింగ్  కార్పొరేషన్ ఏర్పాటు చేసినా నిరుద్యోగ యువతకు కలిగే ప్రయోజనమేమీ లేదని పేర్కొంటూ సీఎం జగన్ కు బ్రహ్మం బహిరంగ లేఖ రాశారు. 

నాదెండ్ల బ్రహ్మ ముఖ్యమంత్రికి రాసిన లేక యధావిధిగా...

                                                                                                          తేదీ: 03.07.2020


                                                                బహిరంగ లేఖ

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టీడీపీ రాష్ట్ర నాయకులు  బ్రహ్మం బహిరంగ లేఖ

నిరుద్యోగ యువతకు తక్షణమే జగన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి - నాదెళ్ల బ్రహ్మం


ప్రభుత్వ శాఖల్లో, కార్పొరేషన్ల లో ఉన్న ఉద్యోగాలన్నింటిని వైసిపి కార్యకర్తలతో భర్తీ చేయించి ఇప్పుడు ఔట్ సోర్సింగ్  కార్పొరేషన్ ఏర్పాటు చేయడం  వలన నిరుద్యోగులకు ఏ విధంగా ఉపయోగమో ప్రజలకు సమాధానం చెప్పాలి.  మార్కెట్ లో చేపలు అమ్మినట్లు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను వైసీపీ నేతలు అమ్మిన మాట వాస్తవం కాదా?

లాక్ డౌన్ సమయంలో నిరుద్యోగుల ఇబ్బందులు గురించి ఒక్క క్షణమైనా అలోచించారా? అధికారంలోకి వస్తే  ఉద్యోగాల భర్తీకి ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇస్తా అన్నారు.  ఏడాది పూర్తి అయినా క్యాలెండర్ ఇచ్చిన పాపాన పోలేదు. కనీసం ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ కూడా  పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా ఇవ్వలేదు. మీరు అధికారంలోకి రాగానే విభజన చట్టంలో పేర్కొన్న 1.47 లక్షల ఖాళీలతో పాటు, టీడీపీ ప్రభుత్వంలో భర్తీ కానీ మరో లక్ష ఉద్యోగాలతో కలిపి 2.50 లక్షల ఖాళీలు భర్తీ చేస్తానని నిరుద్యోగులను నమ్మించారు. గత ఏడాది కాలంలో ఏర్పడ్డ మరో 50 వేల ఖాళీల భర్తీ మాటే లేకుండా పోయింది.

అధికారంలోకి వస్తే కాంట్రాక్టు, ఒప్పంద ఉద్యోగులందరిని రెగ్యులర్ చేస్తానని, ఉన్న ఉద్యోగులను తొలగించేది ఉండదని, కొత్త ఉద్యోగాలను సృష్టించి ఉద్యోగ విప్లవం తెస్తానని  చెప్పిన జగన్ రెడ్డి.. రెగ్యులర్ చేయకపోగా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లను మొదలుకొని, ఆశ వర్కర్లు, ఈ సేవ సిబ్బంది, వర్క్ ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, బీమా మిత్రలు, ఆరోగ్య మిత్రలు, గోపాల మిత్రలు, మెప్మా సిబ్బంది, యానిమేటర్లు, ఆర్టీసీ సిబ్బంది లాంటి లక్షల మందిని రోడ్డున పడేసి వాలంటర్ల పేరుతో కార్యకర్తలతో నింపుకున్నారు.  

మెగా డిఎస్సీ అని మభ్యపెట్టి ఉన్న టీచర్ ఉద్యోగాలను రద్దు చేస్తున్నారు.. నిరుద్యోగులు రాష్ట్రంలో కోటి మంది ఉన్నారని, అందరికి నిరుద్యోగ భృతి ఇవ్వాలన్న మీరు అధికారంలోకి రాగానే నిరుద్యోగభృతి ని రద్దు చేసి నిరుద్యోగులకు ద్రోహం చేశారు. ఉద్యోగాలు సాధించడానికి నిరుద్యోగులకు ఎన్టీఆర్ విద్యోన్నతి ద్వారా ఉచితంగా శిక్షణతో పాటు, నెలవారీ ఖర్చులను కూడా టీడీపీ ప్రభుత్వం భరించింది. అలాంటి విద్యోన్నతి లేకుండా చేసి నిరుద్యోగుల పొట్టగొట్టారు.  ఏడాది కాలంలో నిరుద్యోగ యవత ను దారుణంగా మోసం చేశారు. 

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు క్షమాపణలు చెప్పి నిరుద్యోగులు ఉద్యోగాలు పొందేవరకు ప్రతినెలా 5 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇచ్చి తక్షణమే ఆదుకోవాలి. ఉద్యోగ క్యాలెండర్ తక్షణమే విడుదల చేసి, మీరు చెప్పిన 2.50 లక్షల ఉద్యోగాలతో పాటు, గత ఏడాది కాలంలో ఏర్పడ్డ మరో 50 వేల ఉద్యోగాలను కలుపుకొని 3 లక్షల ఉద్యోగాలకు పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా భర్తీ చేయాలి.  రాష్ట్రంలో ఉన్న ఒప్పంద ఉద్యోగులను, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. ఇప్పటికే తొలగించిన అన్నిరకాల ఒప్పంద ఉద్యోగులను, కాంట్రాక్టు ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. 
                                                                                                              
నాదెళ్ల బ్రహ్మం 
టీడీపీ నాయకులు.