వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భార్య భారతిపై ఈడీ నమోదు చేసిన ఛార్జ్ షీట్ పై వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ కూన రవికుమార్ డిమాండ్ చేశారు.

మనీలాండరింగ్‌లో ఆమె ప్రమేయంపై పెదవి విప్పాలన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. వైఎస్‌ భారతిపై ఈడీ నమోదు చేసిన చార్జ్‌షీట్‌పై సమాధానం చెప్పకుండా ఎల్లో మీడియా అంటూ ఆరోపించడం సబబు కాదన్నారు. భారతిని ఐదో ముద్దాయిగా కోర్టులో ఈడీ దాఖలు చేస్తే మీడియాను టార్గెట్‌ చేయడమేంటని ప్రశ్నించారు. 

కాగా.. రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చకుండా ఏపీకి అన్యాయం చేసిన ప్రధాని మోదీని ఓడించడమే లక్ష్యంగా 2019 ఎన్నికల్లో టీడీపీ పని చేస్తుందని శాసనమండలి విప్‌ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో దేశంలో బీజేపీ వ్యతిరేక కూటమితోనే టీడీపీ ప్రయాణం ఉంటుందని స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన రాజ్యసభ చైర్మన్‌ ఎన్నికల్లో బీజేపీ.. వైసీపీ అమర ప్రేమ మరోసారి బట్టబయలైందన్నారు.