ఆంధ్ర ప్రదేశ్ పదో తరగతి పలితాల్లో ఇంత తక్కువగా ఉత్తీర్ణత శాతం రావడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసమర్ధ పాలనే కారణమని మాజీ మంత్రి జవహర్ ఆరోపించారు.
అమరావతి: నేడు వెలువడిన పదో తరగతి పలితాల్లో (AP SSC Results 2022) ఉత్తీర్ణతా శాతం తగ్గడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) అసమర్ధ పాలనే కారణమని మాజీ మంత్రి కేఎస్ జవహర్ (KS Jawahar) ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో వుంచుకుని వారి చదువు సజావుగా సాగేలా చూసేందుకు ఒక్క డీఎస్సీనైనా నిర్వహించి సమర్ధులయిన ఉపాధ్యాయుల నియామకం చేపట్టి వుండాల్సిందన్నారు. అలా చేసివుంటే ఇప్పుడిలా తక్కువ ఫలితాలు వచ్చి ఉండేవి కాదని జవహర్ అభిప్రాయపడ్డారు.
''పాఠశాలల్లో విద్యార్ధుల అడ్మిషన్ నుంచి ఫలితాల వెలువడించేంత వరకు ప్రతి దశలోను ప్రభుత్వం వైఫల్యం అయ్యింది. ప్రశ్నా పత్రాలు లీక్ చేసి విద్యార్ధుల జీవితాలతో ఆటలాడారు. 3 ఏళ్ల పాటు విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో నేడు పదవ తరగతి ఫలితాలు చూస్తే అర్ధమవుతున్నాయి. వైసీపీ పాలనలో మొట్ట మొదటి పదవ తరగతి ఫలితాలు కేవలం 64.02 శాతం మాత్రమే రావడం సిగ్గుచేటు. విద్యా ప్రమాణాలు దిగజారిపోయాయనడానికి ఇంతకంటే నిదర్శనం మరొక్కటి లేదు'' అని జవహర్ అన్నారు.
''జగన్ రెడ్డి మొదటి రెండేళ్ల కరోనా ఉండటంతో నూటికి నూరుశాతం ఫలితాలు వచ్చాయి. కాని నేడు అసలు రంగు భయటపడింది. కేవలం విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అహంతో విద్యార్ధుల ఫలితాలు ఆలస్యం చేసి అపహాస్యం చేశారు. 6.22 లక్షల మంది గాను 4,14,281 లక్షల మంది ఉత్తీర్ణత అంటే దాదాపు 2 లక్షల మంది విద్యార్ధుల భవిష్యత్ ను అంధకారం చేసాడు జగన్ రెడ్డి'' అని ఆందోళన వ్యక్తం చేసారు.
''చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) హయాంలో 93.63 శాతం ఉత్తీర్ణతో విద్యార్ధులు భవిష్యత్ కు బాటలు వేసుకున్నారు. నాణ్యమైన విద్యలో 3వ స్థానం నుంచి 19వ స్థానానికి దిగజార్చారు. పదవి తరగతి విద్యార్ధులకు పరీక్షల సమయంలో సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందింది'' అన్నారు.
''నాడు నేడు అంటూ రంగులు మార్చి పాఠశాలలను అడ్డం పెట్టుకొని దోచుకుంటున్నారు. స్కాలర్ షిప్స్ ను ఎగ్గొట్టి అమ్మ ఒడి పేరుతో ఇస్తూ నాన్న బుడ్డిగా మారుస్తున్నారు. జగన్ రెడ్డి చేతగాని పాలనతో విద్యార్ధుల భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టేస్తున్నారు. ఆంగ్ల మాధ్యమం మోజులో మాతృభాషకు తూట్లు పొడిచారు. ఒక్క డీఎస్సీ కూడా జరపకుండా 20వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేకపోయారు. ఉపాధ్యాయులచే మద్యం షాపుల ముందు నిలబెట్టిన ఘనత జగన్ రెడ్డికే దక్కింది'' అని మండిపడ్డారు.
''కరోనా సమయంలో దాదాపు 1500 మంది ఉపాధ్యాయులు చనిపోతే జగన్ రెడ్డి వారి కుటుంబాలను ఆదుకోలేదు. జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారన్న కక్షతో కుట్ర పూరితంగా బయోమెట్రిక్ లు ఏర్పాటు చేశారు. పీఆర్సీ (PRC) అమలు చేయమని, సీపీఎస్ (CPS) రద్దు చేయమని కోరినందుకు వైసీపీ నాయకులు ఉపాధ్యాయులను అవమానాలకు గురి చేశారు'' అని మాజీ మంత్రి కె.ఎస్. జవహార్ ఆరోపించారు.
