టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నోటి బలుపుతో అనిల్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ తాత, తండ్రుల గురించి మాట్లాడే అర్హత అనిల్‌కు లేదని చురకలంటించారు. లోకేష్ అభ్యుదయ భావాలు వున్న వ్యక్తని, ఆయన ఆలోచనలు బజారు మనిషి లాంటి అనిల్‌కు అర్థం కావన్నారు. యువగళం పాదయాత్రకు వస్తున్న ఆదరణను చూసి అనిల్ కుమార్ యాదవ్‌కు మతి భ్రమించిందని జవహర్ దుయ్యబట్టారు. నెల్లూరు నగరానికి అనిల్ ఏం చేశారని జవహర్ నిలదీశారు. నీటిపారుదల శాఖ మంత్రిగా అనిల్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని.. లోకేష్‌పై అవాకులు, చవాకులు పేలడం మానాలని జవహర్ హితవు పలికారు.
అంతకుముందు మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లోకేష్ పాదయాత్రలో ఆనం రామనారాయణరెడ్డి పాల్గొనడంపై స్పందించిన అనిల్ కుమార్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గొప్ప చరిత్ర ఉందని చెప్పుకునే ఆనం రామనారాయణరెడ్డి ఆయన కుటుంబ పరువును లోకేష్ కాళ్ల దగ్గర పెట్టారని విమర్శించారు. వార్డు మెంబర్‌గా గెలవలేని వ్యక్తి చుట్టూ ఆనం తిరుగుతున్నారని అన్నారు. అలాంటి ఆనం తన గురించి మాట్లాడటమేమిటని ప్రశ్నించారు. ఆనం వైఖరిని నెల్లూరు ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు.
Also Read: ఆనం రామనారాయణరెడ్డి ఆయన కుటుంబ పరువును లోకేష్ కాళ్ల దగ్గర పెట్టారు: అనిల్ కుమార్ ఫైర్..
ఇక, కొద్దిరోజులుగా నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్, ఆనం రామనారాయణరెడ్డిల మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. నెల్లూరు అభివృద్దిపై చర్చకు రావాలని టీడీపీ నేత లోకేష్‌కు అనిల్ కుమార్ యాదవ్ సవాలు విసిరారు. ఆనం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. గత మూడేళ్లుగా వెంకటగిరి శాసనసభ్యుడిగా ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. ఆనం రామనారాయణరెడ్డికి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీడీపీలో కొనసాగాలని సవాలు విసిరారు. నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గంలో ఆయనకు అనుచరులే అని విమర్శించారు.
నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తే రామనారాయణరెడ్డి రాజకీయ జీవితాన్ని ముగించేస్తామని అన్నారు. ఒకవేళ తాను ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానని ప్రకటించారు. రామనారాయణరెడ్డి అనైతిక రాజకీయాలతో ఆనం కుటుంబ చరిత్రను పరువు తీశారని అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. అయితే అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలపై స్పందించిన ఆనం.. వైసీపీ నాయకుల అడ్డగోలు వ్యాఖ్యల్ని పట్టించుకోనని అన్నారు. వైసీపీ నాయకులు నెల్లూరు జిల్లా రాజకీయాలను కలుషితం చేశారని దుయ్యబట్టారు.
