గుంటూరు: సొమ్మొకరిది–సోకొకరిది, అత్తసొమ్ము అల్లుడిదానం వంటి సామెతలు ప్రభుత్వ చర్యలకు, వైసిపి పార్టీ అనుకూల మీడియాకు చెందిన రాతలకు సరిగ్గా సరిపోతాయని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన తన సందేశాన్ని వీడియో రూపంలో విలేకరులకు పంపించారు. 

''ఆంధ్రప్రదేశ్ లో కైనెటిక్ గ్రీన్ పెట్టుబడులు రూ.1750కోట్లతో ప్రతిపాదనలు అని వైసిపి అనుకూల పత్రికలో రాశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కృషికారణంగా, ఆయన చరిష్మా, రాష్ట్ర ప్రభుత్వ పాలన చూసి కైనెటిక్ గ్రీన్ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చినట్లు చెప్పారు. ఈ ప్రభుత్వానికి కొంచెమైనా సిగ్గుంటే,  ఇతరులు చేసిన కృషిని తమదిగా చెప్పుకోవడం మానేస్తుంది. పరీక్షల్లో పక్కవాడి సమాధానాల పత్రం లాక్కొని దానిపై మన పేరు రాసి ఇచ్చినట్లుగా ఈ ప్రభుత్వ చర్యలున్నాయి''అని మండిపడ్డారు. 

''గతంలో కూడా ఇలానే చేశారు. 2014-19 మధ్యన చంద్రబాబు కృషితో అనేక కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. వేలకోట్ల పెట్టుబడులు పెట్టాయి. లక్షలాదిమందికి ఉపాధి కల్పన జరిగింది. ఆ రకంగా టీడీపీ ప్రభుత్వం ‘తోరే ఇండస్ట్రీస్’ అనే జపనీస్ కంపెనీని రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. ఆ కంపెనీ తామే తెచ్చినట్లు ఈ ప్రభుత్వం గతంలో కూడా డబ్బాలు కొట్టుకుంది. అలానే వీరవాహన్ అనే బస్సుల తయారీ కంపెనీ యూనిట్ ను టీడీపీ ప్రభుత్వం తీసుకొస్తే దాని విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వం సొంతడప్పు కొట్టుకుంది'' అన్నారు. 

''ఇక కియా మోటార్స్ విషయంలో అయితే మరీ ఘోరం. రాజశేఖర్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఏదో లేఖరాస్తే దానికి స్పందించి పదేళ్లతర్వాత  కియా  యాజమాన్యం రాష్ట్రంలో యూనిట్ పెట్టినట్లు చెప్పుకున్నారు. ఇలాంటి తప్పుడు రాతలు, విడ్డూరాలు అనేకం. ప్రజలు ఏమనుకుంటారో అని కూడా ఆలోచన చేయడం లేదు. అదేవిధంగా అపోలో టైర్స్ కంపెనీకి కూడా చంద్రబాబు ప్రభుత్వం అనేకరకాల ఇన్సెంటివ్స్ లు ఇచ్చి, రాష్ట్రానికి వచ్చేలా చేస్తే ఆ కంపెనీ ప్రొడక్షన్ మొదలుపెట్టినరోజు వైసీపీనేతలంతా డప్పులు కొట్టుకోవడం జరిగింది. అలానే టీసీఎల్ కంపెనీ విషయంలో రోజా తెగ సంబరపడిపోయింది. మెడ్ టెక్ జోన్ ఎవరుఏర్పాటు చేశారో అందరికీ తెలుసు. దాన్ని తమ ప్రభుత్వమే తీసుకొచ్చినట్టు మంత్రి గౌతమ్ రెడ్డి పెద్దపెద్ద ప్రకటనలిస్తాడు. 
ఇప్పుడేమో కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ గురించి అలానే  చెప్పుకుంటున్నారు'' అని మండిపడ్డారు. 

''27 జూలై -2018న ఆనాడు మంత్రిగా ఉన్న నారా లోకేశ్ ఏపీలో కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ పెట్టేలా ఆ కంపెనీ సీఈవోతో మాట్లాడారు. ఆ కంపెనీ సీఈవో (సులర్జా ఫిరోదియా మోత్వాని), కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రితేశ్ లను ప్రత్యేకంగా ఏపీకి ఆహ్వానించి, రాష్ట్రంలో పెట్టుబడులుపెట్టేలా లోకేశ్ వారిని ఒప్పించారు. (కంపెనీ సీఈవోతో లోకేశ్ భేటీ అయిన ఫొటోలను, వివరాలను పట్టాభి ప్రదర్శించారు.) ఆ విధంగా లోకేశ్ తీసుకొచ్చిన కంపెనీని తామే తెచ్చినట్లు సిగ్గులేకుండా  ఎలా చెప్పుకుంటారు. ట్విట్టర్లో రెట్టలేసే ట్విట్టర్ పక్షి విజయసాయిరెడ్డి అయితే మరీ  సిగ్గులేకుండా ట్వీట్లు పెడుతున్నాడుసస అని విరుచుకుపడ్డారు. 

''టోనీ లంబోర్ఝిని అనే కంపెనీ ఫిబ్రవరి 2018లో కైనెటిక్ ఎనర్జీ కంపెనీతో ఒప్పందం చేసుకుంటే ఆ విషయం తెలుసుకొని, ఆనాడు లోకేశ్ ప్రత్యేకంగా రాష్ట్రానికి ఆహ్వానించి చర్చలు జరిపింది జూలై-2018న. ట్విట్టర్ పక్షేమో డైనమిక్ లీడర్ షిప్ చూసి కైనెటిక్ ఏపీకి వచ్చినట్లు చెబుతున్నాడు. వచ్చిన కంపెనీలన్నింటినీ తన్ని తరిమేయడమేనా మీ డైనమిక్ లీడర్ షిప్? ఆనాడు టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కంపెనీలన్నీ, తామే తెచ్చినట్లు ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రజలను నమ్మించాలని చూడటం. ఎప్పటికీ కూడా రాష్ట్రహితం కోసం పనిచేసే నాయకుడు చంద్రబాబునాయుడు మాత్రమే'' అని అన్నారు. 

'' గతంలో హైదరాబాద్ ను ఐటీ కేంద్రంగా ఎలాగైతే మార్చారో, తరువాత 2014-2019మధ్యన విభజనానంతర రాష్ట్రానికి పరిశ్రమలు, ప్రముఖ కంపెనీలు తీసుకురావడానికి తీవ్రంగా కృషిచేశారు. ఆ కోవలోనే కైనెటిక్ గ్రీన్ ఎనర్జీనికూడా రూ.1750కోట్ల పెట్టుబడితో రాష్ట్రానికి తీసుకొచ్చింది చంద్రబాబు నాయకత్వం, లోకేశ్ నేర్పరితనమే. ఇతరులు చేసిన పనులు తమవిగా చెప్పుకోవడం నీచాతినీచమని పాలకులు తెలుసుకుంటే మంచిది. ఇష్టమొచ్చినట్లు ట్వీట్లు పెట్టడం, చేతిలో తప్పుడు పత్రిక ఉందికదా అని పిచ్చిరాతలు రాయడం మానుకోండి'' అని సూచించారు. 

''వీళ్ల ముఖాలు చూసి ఎవరూ రాష్ట్రంలో రూపాయికూడా పెట్టుబడి పెట్టడం లేదు. రాష్ట్రంలో మీరువేస్తున్న జే-ట్యాక్సులు చూసి, ఉన్నవాళ్లే పారిపోతుంటే కొత్తగా వచ్చేవారు ఎవరుంటారు?  ఇప్పటికే వీళ్లను చూసి అనేక కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. వీళ్లపాలన చూసి విసిగివేసారిన ప్రజలు వీళ్లకు సరిగ్గా బుద్ధి చెప్పడానికి ఎదురుచూస్తున్నారు'' అని పట్టాభిరాం హెచ్చరించారు.