గుంటూరు: టీడీపీ యువనేత కోడెల శివరామకృష్ణకు షాక్ తగిలింది. కేట్యాక్స్‌ ఆరోపణ కేసులో ఆయన పీఏ గుత్తా నాగ ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నరసరావుపేటలో వైన్స్ షాపు నిర్వహించేందుకు ఓ వ్యాపారి నుంచి రూ.43లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు గుత్తా నాగప్రసాద్ ను అరెస్ట్ చేశారు. 

వివరాల్లోకి వెళ్తే హరిప్రియ వైన్స్ నిర్వాహకుడు మర్రిబోయిన చంద్రశేఖర్ గుత్తా నాగప్రసాద్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైన్స్ నడుపుటకు తన దగ్గర రూ.43 లక్షలు వసూలు చేసినట్లు నాగప్రసాద్ పై చంద్రశేఖర్ నరసరావుపేట టూటౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. 

చంద్రశేఖర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కావడంతో అప్పటి నుంచి నాగప్రసాద్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ఎట్టకేలకు గురువారం సాయంత్రం పోలీసులకు చిక్కారు. గుత్తా నాగ ప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే కోడెల శివరాంకు పీఏగా ఉన్న గుత్తా నాగప్రసాద్ కే ట్యాక్స్ వసూలు చేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కోడెల శివప్రసాదరావు స్పీకర్ గా ఉన్నప్పుడు ఆయన తనయుడు కోడెల శివరాం కే ట్యాక్స్ వసూలు చేశారని టీడీపీ, వైసీపీలతోపాటు పలువురు వ్యాపారస్తులు కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. 

కే ట్యాక్స్ వసూలలో కీలక పాత్రధారి గుత్తా నాగప్రసాద్‌ అని ప్రచారం. కోడెల కుటంబానికి అన్నీ తానై గుత్తా నాగ ప్రసాద్ వ్యవహరించారని ఇప్పటకీ ప్రచారంలో ఉంది. సత్తెనపల్లి, నరసరావుపేట, గుంటూరు నియోజకవర్గాల్లో ఏ ఒక్క వర్గాన్నీ వదలకుండా బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని పోలీసుల ఫిర్యాదులో కూడా పేర్కొన్న సంగతి తెలిసిందే.  

మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, అతని కుమారుడు శివరామకృష్ణలపై నమోదైన కేసుల్లోనూ నాగప్రసాద్‌ నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. శివరాంకు చెందిన కొన్ని ఆస్తులను నాగప్రసాద్ పేరిట రాయించినట్లు కూడా చర్చ జరుగుతుంది. 

కోడెల శివరామకృష్ణ అరెస్ట్ నేపథ్యంలో గుంటూరులో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కోడెల శివరామకృష్ణను కూడా అరెస్ట్ చేస్తారేమోనంటూ ప్రచారం జరుగుతుంది. పోలీసుల విచారణలో నాగప్రసాద్ ఎలాంటి సమాచారం ఇస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కే ట్యాక్స్ వసూలు ఆరోపణలు నిజమైతే శివరామకృష్ణ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇకపోతే తన తండ్రి కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నారు శివరామకృష్ణ. కోడెల ఆత్మహత్యపై కేసునమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.