విజయవాడ ఎంపీ కేశినేని నానిపై ఆయన సోదరుడు, టీడీపీ నేత కేశినేని చిన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో ఢిల్లీలో లోకేష్ ఏయే లాయర్లను కలిశారు, ఎవరితో చర్చలు జరుపుతున్నారనే విషయాన్ని వైసీపీకి నాని చేరవేశారని చిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విజయవాడలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నానిపై ఆయన సోదరుడు, టీడీపీ నేత కేశినేని చిన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కేశినేని నాని టీడీపీని నాశనం చేశారని , ఆయన ఊసరవెల్లి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశంలో వుంటూ వైసీపీ కోసం కేశినేని పనిచేశారని చిన్ని ఆరోపించారు. గతంలో ఢిల్లీలో లోకేష్ ఏయే లాయర్లను కలిశారు, ఎవరితో చర్చలు జరుపుతున్నారనే విషయాన్ని వైసీపీకి నాని చేరవేశారని చిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు హాల్‌లో బెయిల్ రాకుండా వచ్చిందంటూ ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. 

ఒకప్పుడు చంద్రబాబు కోసం పూజలు చేసిన కేశినేని నాని.. ఇప్పుడు ఆయననే విమర్శిస్తున్నారని చిన్ని మండిపడ్డారు. విజయవాడ వెస్ట్‌లో టికెట్లు ఇప్పిస్తానని కేశినేని నాని ఇద్దరి నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారని, డబ్బు తిరిగి ఇవ్వమని వారు నానిపై ఒత్తిడి తెస్తున్నారని చిన్ని చెప్పారు. నాని కాల్ డేటా తన వద్ద వుందని, ఆయన ఓ వసూల్ రాజా అంటూ దుయ్యబట్టారు. తనను పిట్టల దొర అంటున్న కేశినేని నాని విషయాన్ని ప్రజలే తేలుస్తారని.. జగన్ వద్ద నాని పాలేరు పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడ ఎంపీ టికెట్ కేశినేని నానికి ఇవ్వడం జగన్‌కు ఇష్టం లేదని.. దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్‌లకు కేశినేని నాని అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. 

నానికి ఇది లాస్ట్ ఎలక్షన్స్ అని.. నానికి డబ్బు ఇచ్చిన వాళ్లు కూడా త్వరలో మీడియా ముందుకు వస్తారని కేశినేని చిన్ని హెచ్చరించారు. నానిది సైకో మనస్తత్వమని.. మొన్నటి వరకు ఏసీ రూముల్లో కూర్చొని ఇప్పుడు బిల్డప్‌లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నర నెలల్లో ప్రజలు జగన్ బ్యాచ్‌కి తగిన బుద్ధి చెబుతారని చిన్ని హెచ్చరించారు.