గత ఎన్నికల్లో తన తనయుడు కేఈ శ్యాంబాబు ఓడిపోవడం తనను కుంగదీసిందని... టీడీపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎంతగానో కృషి చేశానని... అయినప్పటికీ.. భారీ తేడాతో ఓడిపోవడం బాధ కలిగించిందని ఆయన అన్నారు. గురువారం ఆయన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. తన కుమారుడు, టీడీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్ చార్జి కేఈ శ్యాంబాబు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు.

ఈ నేపథ్యంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ  భావోద్వేగానికి గురయ్యారు. పత్తికొండ నియోజకవర్గంలో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించారని.. అయినా తన కుమారుడు ఓటమి పాలయ్యాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన తనను ఎంతగానో కుంగదీసిందని ఆయన పేర్కొన్నారు. మాట్లాడుతూనే ఆయన కన్నీరు పెట్టుకున్నారు. 

ప్రజలు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తానని చెప్పారు. కాగా... వచ్చే ఎన్నికల్లో తన కుమారుడి గెలుపు కోసం ఇప్పటి నుంచే కృషి చేస్తానని..అందుకు సహకరించాలని ఆయన కార్యకర్తలను కోరారు. వైసీపీ నేతలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా... కార్యకర్తలు పార్టీని వీడకుండా ఉండటం అభినందనీయమన్నారు. కార్యర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

అనంతరం సీఎం జగన్ పై విమర్శలు చేశారు. జగన్ విధానాల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోతాయేమోననే భయం కలుగుతోందన్నారు.  గత ఎన్నికల్లో జగన్ కోసం కేసీఆర్ డబ్బులు ఖర్చు పెట్టారని ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రీకౌంటింగ్ పెట్టి ఉంటే... కచ్చితంగా టీడీపీ గెలిచి ఉండేదని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో పారదర్శకత కనిపించడం లేదన్నారు. 

జగన్ పాలనలో రౌడీ రాజ్యం నడుస్తోందని... టీడీపీ నేతలే టార్గెట్ గా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకు చంద్రబాబు పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారని...ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆయన ఈ సందర్భంగా పార్టీ నేతలకు సూచించారు.