వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలు ప్రజలకు క్షమాపణలు  చెప్పాలని టీడీపీ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి కనపర్తి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గతేడాది విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత జగన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ దాడి టీడీపీ నేతలే చేయించారంటూ వైసీపీ ఆరోపించింది. కాగా.. తాజాగా జగన్ పై దాడి వెనుక ఎలాంటి కుట్ర కోణం లేదని ఎన్ఐఏ తేల్చి చెప్పింది.

ఈ విషయంపై టీడీపీ నేత కనపర్తి స్పందించారు. జగన్‌ పై దాడి వెనుక ఎటువంటి కుట్ర కోణం లేదని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తేల్చిందని, దీనిపై ఆ పార్టీ నేతలు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఆ దాడి వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ ఉన్నారని ఆరోపించిన ఎంపీ విజయసాయిరెడ్డిది దిగజారుడు రాజకీయం కాదా అంటూ నిలదీశారు.
 
తండ్రి మరణం, కోడి కత్తి దాడి, సోదరి షర్మిలపై కథనాలను సాకుగా చూపి రాజకీయ లబ్ధి పొందాలన్నది జగన్‌ రాజకీయ ఎత్తుగడ అని ఆరోపించారు. ఇది చాలదన్నట్లు హోదా ఇచ్చే పార్టీతోనే జట్టు కడతామని బహిరంగంగా ప్రకటిస్తూ.. హోదా ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చిచెబుతున్న బీజేపీతో అంటకాగడంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.