రాష్ట్రంపై కేంద్రం చూపిస్తున్న వివక్ష పట్ల నిలదీస్తున్నందునే ఈ దాడులు జరుగుతున్నాయని కనకమేడల ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. భయభ్రాంతులకు గురిచేసినా తట్టుకుని నిలబడేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
రాజకీయ కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఐటీ దాడులు చేయిస్తోందని టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. గురువారం సాయంత్రం నుంచి ఏపీలో ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై కనకమేడల స్పందించారు.
ఐటీ దాడుల పేరిట కేంద్ర ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతోందని ఆయన అన్నారు. అధికార దుర్వినియోగంలో మోదీ ప్రభుత్వం ముందజలో ఉందని విమర్శించారు. కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెలుగుదేశం ప్రభుత్వం.. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీలు, రాష్ట్రంపై కేంద్రం చూపిస్తున్న వివక్ష పట్ల నిలదీస్తున్నందునే ఈ దాడులు జరుగుతున్నాయని కనకమేడల ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. భయభ్రాంతులకు గురిచేసినా తట్టుకుని నిలబడేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇలాంటి చర్యలు మానుకుంటే మంచిదని హితవు పలికారు.
కార్పోరేట్ సంస్థల్లో ఐటీ సోదాలు చేసి.. వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయించేలా కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రత్యర్థులపై పగ తీర్చుకునే చర్యల్లో భాగంగా న్యాయస్థానాలను వాడుకునేందుకు కూడా వారు వెనకాడటం లేదన్నారు. బాబ్లీ కేసులో చంద్రబాబుకు నోటీసులు జారీ కావడం దీనిలోని భాగమేనని ఆరోపించారు. ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని... ఇదే విషయాన్ని హైకోర్టు కూడా స్పష్టం చేసిందని ఆయన పేర్కొన్నారు.
