హోంశాఖ ముఖ్యకార్యధర్శికి టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు లేఖ రాశారు.  ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు  రాజధాని పర్యటనకు ఉపయోగించిన బస్సు (AP16 TB 0555 )ను  ధర్యాప్తు పేరుతో  పోలీసులు సీజ్ చేసి  బస్సు యాజమాన్యానికి  ఇబ్బంది పెడుతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. 

పోలీసులు ప్రతిపక్షనేతపై దాడి చేసిన వారిని వదిలేసి  దర్యాప్తు పేరుతో బస్సును సీజ్ చేయటం ఏంటి అంటూ ఆయన ప్రశ్నించారు. 9 రోజులపాటు బస్సును పోలీసులు  స్వాదీనంలోనే  ఉంచుకుని యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టడం సరికాదని ఆయన మండిపడ్డారు. పోలీసులు బస్సును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  పోలీసులు చట్టం ప్రకారం పనిచేయాలన్నారు.

ప్రభుత్వం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. రాజధాని పర్యటనలో చంద్రబాబు నాయుడుపై దాడి చేయించిదెవరో  ప్రభుత్వం బయటపెట్టాలన్నారు. ముఖ్యమంత్రి  ప్రతిపక్ష పార్టీలపై కక్షసాధింపు చర్యలు మానుకుని పాలనపై దృష్టి పెట్టాలన్నారు.