అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. స్థానిక రంగనాథ స్వామి తిరునాళ్లకు ఎమ్మెల్యే పెద్దారెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకేసారి వచ్చారు. దీంతో జేసీని కాసేపు నిలిపివేశారు పోలీసులు.  

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాడిపత్రి మండలం ఆలూరు రంగనాథ స్వామి తిరునాళ్లకు వెళ్లారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి. అదే సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. దీనిని గమనించిన పోలీసులు కాసేపు ఆగి వెళ్లాలని సూచించారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరికి ఎమ్మెల్యే వెళ్లిపోయిన తర్వాత జేసీని అనుమతించారు పోలీసులు. 

ఇకపోతే.. తాడిపత్రిలో జేసీ , కేతిరెడ్డి కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే సంగతి తెలిసిందే. గత ఫిబ్రవరి నెలలో మరోసారి అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (kethireddy pedda reddy) తండ్రి రామిరెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కారణమైంది. దీంతో తాడిపత్రిలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. అసలేం జరిగిందంటే.. ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన తండ్రి రామిరెడ్డి విగ్రహాన్ని తాడిపత్రి పట్టణంలో ఆవిష్కరించాలని చూస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే రామిరెడ్డి కాంస్య విగ్రహాన్ని తయారు చేయించారు.

తాడిపత్రి-అనంతపురం ప్రధాన రహదారిలో యాక్సిస్‌ బ్యాంక్‌ ఎదురుగా విగ్రహాన్ని ఏర్పాటు చేయదలచిన ప్రాంతంలోని విగ్రహానికి ముసుగు వేసి నిలబెట్టారు. అయితే దీనిపై టీడీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. హైవేపై విగ్రహాలు పెట్టకూడదన్న సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. 

ఈ క్రమంలోనే విగ్రహ ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) అనుచరులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విగ్రహాల ఏర్పాటు విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. మున్సిపల్‌ పాలకవర్గం అనుమతి తీసుకోకుండా విగ్రహం ఏర్పాటు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో తాడిపత్రిలో మరోసారి వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య రాజకీయంగా ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. 

ఈ క్రమంలోనే మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రబాకర్ రెడ్డి.. అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యేకు అధికారులు భయపడుతున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు నిబంధనలను కూడా తుంగలో తొక్కుతున్నారని అన్నారు. తన తండ్రి జేసీ నాగిరెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడు అని చెప్పారు. తన తండ్రి విగ్రహం పెట్టాలని ఉందని.. కానీ విగ్రహాలు పెడితే ఏం జరుగుతుందో తనకు తెలుసని వ్యాఖ్యానించారు. తాడిపత్రిలో నిబంధనలకు విరుద్దంగా విగ్రహాన్ని పెట్టారని.. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ వివాదాల నేపథ్యంలో అధికారులు నలిగిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది.