వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఏపీ సర్కార్ ఆలస్యం చేయడం వెనక ఎత్తుగడ ఉందని ఆయన ఆరోపించారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఉన్నంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని జేసీ తేల్చి చెప్పారు. జస్టిస్ కనగరాజ్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించుకుని ఏకగ్రీవం చేసుకునే ఎత్తుగడలో భాగంగానే ప్రభుత్వం ఇలా చేస్తోందని ఆయన ఆరోపించారు.

పంతం, పట్టింపుతో ఈ ప్రభుత్వం పోతోందని, ఎన్నికల కమిషనర్‌గా కనగరాజ్‌ను నియమించుకున్నాక ఇష్టానుసారం ఎన్నికలు జరుపుతారని దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

గతంలో ఏకగ్రీవమైన వాటన్నింటిని కరెక్ట్ అంటూ కనగరాజుతో ఆదేశాలు వచ్చేలా చేస్తారని జేసీ చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు నామినేషన్లు వేస్తే పోలీసు బలంతో బెదరింపులకు గురిచేసి విత్ డ్రా చేయిస్తారని దివాకర్ రెడ్డి ఆరోపించారు.

తలనొప్పి, జ్వరం, క్యాంపుల పేరుతో ఎన్నికల కమిషన్ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లకు అధికారులు హాజరవ్వరని ఆయన అన్నారు.  ప్రజాభిమానం తమకు ఉన్నా... ఎన్నికలు వన్ సైడ్‌గా జరుగుతాయని జేసీ అభిప్రాయపడ్డారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు పోటీ చేయకపోవడమే బెటర్ అని.. ఒకవేళ ఎన్నికల్లో గెలిచినా ఏదో ఒక కేసు పెట్టి లోపల వేస్తారని ఆరోపించారు.