అమరావతి: ఇటీవల శాసనమండలిలో చోటుచేసుకున్న పరిణామాలు, ఆ తర్వాత మంత్రులు, వైసిపి నాయకుల ఎదురుదాడికి చూస్తే... మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కినట్టుగా వుందని మాజీ మంత్రి జవహర్ అన్నారు. మండలి ప్రత్యక్ష ప్రసారాల నిలిపివేయడం ఏ రహస్య దాడుల కోసమో రాష్ట్ర ప్రజలందరికి తెలుసని  జవహర్ ఆరోపించారు. 

''మండలిలో 18 మంది మంత్రులకు పనేంటి!  ప్రతిపక్షంపై దాడి వ్యూహత్మకమే. వైసిపి నేరచరితులకు అడ్డాగా వుంది. నేరస్తులను ప్రోత్సాహించి ప్రజాప్రతినిధులను చేసింది జగనే. నేరస్తుల కూటమిగా వైసిపి మారింది'' అని విమర్శించారు. 

''మండలిలో చోటుచేసుకున్న పరిణామాలపై వీడియో పుటేజ్ విడుదల చేయాలి. దీంతో ఎవరు ఎవరిపై దాడికి ప్రయత్నించారు... అసలు మండలిలో ఏం జరిగిందో ప్రజలకు తెలుస్తుంది'' అని అన్నారు. 

''అయినా నేరప్రవృత్తి కలిగిన వైకాపా నేతల మాటలను ప్రజలు నమ్మరు. వైసిపి మంత్రులు, నాయకులకు మత విశ్వాసాలను హేళన చేయడం పరిపాటిగా మారడం క్షమార్హం. 
జగన్ కు పరమతాలపట్ల గౌరవం వుంటే మంత్రులు నారాయణ స్వామి, అనిల్ యాదవ్ ని కేబినెట్ నుండి బర్త రప్ చేయాలి'' అని జవహర్ డిమాండ్ చేశారు.