అమరావతి: కరోనా కట్టడిలో సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడని, ఆయన కక్కుర్తివల్లే ప్రజల ప్రాణాలు పోతున్నాయని టిడిపి మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. ఆయనకున్న కమీషన్ల దాహం వల్లే వ్యాక్సిన్ గ్లోబల్ టెండర్లలో ఎవరూ ముందుకు రాలేదని అన్నారు. 

తన నివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా సీఎం జగన్ అవినీతిపై మాట్లాడారు ఆంజనేయులు. వైసిపి ప్రభుత్వానికి అవినీతి, కమీషన్ల దాహం తప్ప ప్రజలను కాపాడాలన్న ధ్యాస లేదన్నారు. గ్లోబల్ టెండర్లకు ఏ కంపెనీ ముందుకురాకపోవడం చూస్తేనే ఈ ముఖ్యమంత్రిపై, ప్రభుత్వంపై కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు ఎంతనమ్మకముందో అర్థమవుతోందన్నారు.  

వ్యాక్సిన్ పంపిణీలో దేశంలోనే రాష్ట్రం 28వ స్థానంలో ఉందని ఆంజనేయులు ఆందోళన వ్యక్తం చేశారు.  కరోనా నియంత్రణలో రాష్ట్ర వైఫల్యానికి ముఖ్యమంత్రే బాధ్యత వహించాలన్నారు. ప్రతిపక్షాలను వేధించడంపై, ప్రశ్నించేవారిని అణగదొక్కడంపై  సీఎం పెట్టిన శ్రద్ధలో ఒకవంతైనా కరోనా నియంత్రణపై పెడితే బాగుండేదని జీవీ విమర్శించారు. 

read more  ఆనందయ్య మందుతో నకిలీ వ్యాపారం... ఆ కంపనీ కుట్ర: అచ్చెన్న సంచలనం

''కరోనా మరణాలపై కూడా ప్రభుత్వం దొంగలెక్కలు చెబుతోందని ఆరోపించారు. వ్యాక్సిన్ పంపిణీలో రాష్ట్రం చివరిస్థానంలో ఉందని చెప్పుకోవడానికి ప్రభుత్వానికి సిగ్గెందుకని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ కింద కరోనాకు వైద్యం అందించడానికి ప్రైవేట్ ఆసుపత్రులు ముందుకు రావడంలేదన్నారు. కొన్నిఆసుపత్రులు పేదలను దారుణంగా లూఠీ చేస్తున్నాయన్నారు. ఉత్తమమైన కరోనా చికిత్సను పేదలకు అందించలేని ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనని ఆంజనేయులు మండిపడ్డారు. 

రాష్ట్రంలో లక్షలాది మంది కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోయారని... ఆ ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కూడా ఉంటుందన్నారు. ప్రభుత్వ పనితీరుతో ప్రజలు పడుతున్న అవస్థలు చూసే ఎన్టీఆర్ ట్రస్ట్, హెరిటేజ్ సంస్థలు కరోనా రోగులను ఆదుకోవడానికి ముందుకు వచ్చాయన్నారు. కరోనా కారణంగా ఉపాధిలేక, పస్తులుంటున్న కుటుంబాలకు రూ.10వేలు, మహమ్మారితో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10లక్షల ఆర్థికసాయం ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని ఆంజనేయులు డిమాండ్ చేశారు. 

కరోనా రోగులకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచిత వైద్యం అందేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలకు వ్యాక్సిన్లు అందకపోవడానికి ముఖ్యమంత్రి కమీషన్ల కక్కుర్తే కారణమన్నారు. మూడోదశ కరోనా వస్తే చిన్నారులకు ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నందున ముఖ్యమంత్రి ఆ దిశగా వెంటనే రక్షణచర్యలు ప్రారంభించాలని ఆంజనేయులు డిమాండ్ చేశారు.