సారాంశం

రాష్ట్రంలోని 175 స్థానాల్లోనూ బోగస్ ఓట్లు వున్నాయన్నారు టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు . ఒకే డోర్ నెంబర్‌పై 200 ఓట్లు వున్నాయంటే రాష్ట్రంలో అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో తెలుస్తుందని చురకలంటించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో అధికార , ప్రతిపక్షాల మధ్య ఓటర్ జాబితాలో అవకతవకలకు సంబంధించి మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరువర్గాలు ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదులు చేసుకున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. రాష్ట్రంలోని 175 స్థానాల్లోనూ బోగస్ ఓట్లు వున్నాయన్నారు.

శుక్రవారం గంటా మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ నార్త్‌లోని అన్ని వార్డుల్లో బోగస్ ఓట్లు వున్నట్లు ప్రాథమికంగా తేలిందన్నారు. దీనిపై చర్యలు చేపట్టాలని గంటా శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో గెలవలేమనే ఉద్దేశంతో అధికార పార్టీ అవకతవకలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. ఒకే డోర్ నెంబర్‌పై 200 ఓట్లు వున్నాయంటే రాష్ట్రంలో అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో తెలుస్తుందని చురకలంటించారు. ఏపీలో విధ్వంసమే తప్పించి.. అభివృద్ధి లేదని గంటా శ్రీనివాసరావు దుయ్యబట్టారు. 

ALso Read: 15 లక్షల ఓట్ల గోల్ మాల్ పై హైలెవల్ కమిటీకి డిమాండ్: సీఈసీతో భేటీ తర్వాత బాబు

కాగా.. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై గత నెల 28న సీఈసీకి ఫిర్యాదు చేశారు చంద్రబాబు. రాష్ట్రంలో ఓట్ల నమోదులో చోటు చేసుకున్న అవకతవకలపై  హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేయాలని  ఆయన ఈసీని కోరారు.ఇతర రాష్ట్రాలకు  చెందిన ఐఎఎస్ లను పంపి  ఓటర్ల నమోదులో అవకతవకలను  సరి చేయాలని ఆయన ఈసీని కోరారు. ఓట్ల తొలగింపుపై కోర్టుకు కూడా వెళ్లిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బెదిరించి, భయపెట్టి తమ పార్టీ అభ్యర్థులను ఉపసంహరింపచేశారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని వింత సమస్య వచ్చిందన్నారు. 

ఒక పార్టీ ఓట్లు  తొలగించాలనే ఆలోచన గతంలో ఎవరికీ రాలేదన్నారు. నకిలీ ఓటరు గుర్తింపు కార్డులను ప్రింట్ చేశారని  చంద్రబాబు ఆరోపించారు. మీడియా సమావేశంలో  నకిలీ ఓటరు గుర్తింపు కార్డులను  ఆయన  మీడియా ప్రతినిధులకు చూపారు. ఈ విషయమై  చర్యలు తీసుకోవాలని  ఈసీ ఆదేశాలు  జారీ చేసినా పట్టించుకోలేదని  చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీ ఎన్నికల్లో నకిలీ డిగ్రీ  ధృవపత్రాలతో  ఓట్లు నమోదు చేయించారని వైఎస్ఆర్‌సీపీపై  చంద్రబాబు ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని  ఆయన మండిపడ్డారు. తమ పార్టీ హయంలో  ఎప్పుడూ  ఇలాంటి చెత్త పనులు చేయలేదని  చంద్రబాబు చెప్పారు. ఓట్ల అక్రమాలపై  ప్రశ్నించే వారిని కేసులతో వేధిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలను  ఈసీకి వివరించినట్టుగా  చంద్రబాబు తెలిపారు.