చంద్రబాబు కనుమరుగైపోతారని ఒకరు.. తొక్కేస్తామని మరొకరు , ఆ మాటలకు అర్ధమేంటీ : గంటా శ్రీనివాసరావు
వైసీపీ నేతలపై మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే వైసీపీ కుట్ర బయటపడుతుందని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు . చంద్రబాబు అరెస్ట్‌ను మంత్రుల స్థాయిలో వున్న వారు సెలబ్రేట్ చేసుకున్నారని గంటా శ్రీనివాసరావు దుయ్యబట్టారు.

వైసీపీ నేతలపై మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2023 తర్వాత చంద్రబాబు కనుమరుగవుతారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం దేనికి సంకేతమన్నారు. చంద్రబాబు అరెస్ట్‌లో కుట్ర కోణం ఉన్నట్లుగా అనుమానించాల్సి వస్తోందని గంటా వ్యాఖ్యానించారు. తాము తలచుకుంటే చంద్రబాబు, లోకేష్‌లు బతికి బట్టకట్టగలరా .. వాళ్లిద్దరిని పాతాళానికి తొక్కేస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరింపులను ఏ విధంగా చూడాలని శ్రీనివాసరావు ప్రశ్నించారు.
వచ్చే ఉగాదికి టీడీపీ, జనసేన కనుమరుగైపోతాయని, లేకపోతే గుండు గీయించుకుంటానని బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు మీద వైసీసీ ఎన్నో రోజులుగా కుట్ర చేసిందని.. దానిని ప్రణాళిక ప్రకారం అమలు చేస్తున్నట్లు అర్ధమవుతోందని గంటా ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే వైసీపీ కుట్ర బయటపడుతుందని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
మీరు కోర్టులో హాజరుకావడాన్ని తప్పించుకోవడానికి 320, స్టే కోసం 158 పిటిషన్లు వేశారని గంటా దుయ్యబట్టారు. 31 కేసుల్లో 11 ఏళ్ల నుంచి బెయిల్‌పై హాయిగా తిరిగేస్తున్నారని.. చట్టాల్లో వున్న వెసులుబాటును మీ ఫ్యామిలీ వాడుకున్నంతగా దేశంలో ఎవరూ వాడుకుని వుండరని శ్రీనివాసరావు సెటైర్లు వేశారు. 73 ఏళ్ల వయసులో చంద్రబాబును హింసించి పైశాచిక ఆనందం పొందాలనే మనస్తత్వమంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్‌ను మంత్రుల స్థాయిలో వున్న వారు సెలబ్రేట్ చేసుకున్నారని గంటా శ్రీనివాసరావు దుయ్యబట్టారు. మీరంతా న్యూమరాలజీ, జ్యోతిష్యాలు బాగా చెబుతున్నారని, 2024 తర్వాత జైల్లో చెప్పుకోవచ్చంటూ ఆయన వ్యాఖ్యానించారు.