టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కి ఊహించని షాక్ తగిలింది. మరో సీనియర్ నేత టీడీపీని వీడీ బీజేపీలో చేరారు. టీడీపీ సీనియర్ నేత, ప్రకాశం జిల్లా జడ్పీ ఛైర్మన్ ఈదర హరిబాబు మంగళవారం బీజేపీలో చేరారు. 

ఢిల్లీలో ఆపార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెపి నడ్డా సమక్షంలో కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు కుమారుడు భరత్‌ కూడా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ... బీజేపీలో చేరడంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.

ఎమ్మెల్యేగా, జెడ్పీ ఛైర్మన్‌గా పనిచేసిన ప్రకాశం జిల్లాలో ఈదర హరిబాబు టీడీపీలో సీనియర్‌ నేతగా ఉన్నారు. 2104 ఎన్నికల తర్వాత జెడ్పీ ఛైర్మన్ పదవి విషయంలో టీడీపీతో విభేదాలు వచ్చాయి. అనూహ్యంగా వైసీపీతో కలిసి ఛైర్మన్ పదవి దక్కించుకున్న ఆయన.. టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు ఆయన్ను పిలించి మాట్లాడారు.. టీడీపీ కోసం పనిచేయాలని కోరారు. చంద్రబాబు కోరడంతో.. ఈదర హరిబాబు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. తాజాగా కాషాయం కండువా కప్పుకున్నారు.