సంగం డెయిరీని ఎట్టి పరిస్ధితుల్లోనూ ప్రభుత్వపరం చేస్తామంటూ మంత్రి సిదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర . శ్రీజ డెయిరీని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాక్కున్నప్పుడు జగన్ ఏం చేశాడంటూ ఆయన చురకలంటించారు.
సంగం డెయిరీని రైతులే కాపాడుకుంటారని అన్నారు టీడీపీ సీనియర్ నేత , డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర . శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పారిశ్రామికవేత్తల మెడపై కత్తిపెట్టి వారి ఆస్తుల్ని, సంస్థల్ని లాక్కుంటున్నారని ఆరోపించారు. సహకార రంగంలో వున్న డెయిరీలను జగన్ కబళిస్తున్నారని నరేంద్ర అన్నారు. తనకు నచ్చినవారికి మేలు చేయడానికే జగన్ అధికారాన్ని వినియోగిస్తున్నారని దీనిలో భాగంగా కాకినాడ పోర్ట్, కాకినాడ ఎస్ఈజెడ్‌లను అరబిందో కంపెనీలకు అప్పగించారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు అమూల్ పేరు చెప్పి సహకార రంగంలోని డెయిరీలను సొంతం చేసుకోవాలని చూస్తున్నాడని నరేంద్ర దుయ్యబట్టారు.
మంత్రి అప్పలరాజు ఏదో అనుకుంటున్నారని.. ఆయన తాతలు దిగివచ్చినా సంగం డెయిరీని లాక్కోలేరని ధూళిపాళ్ల స్పష్టం చేశారు. మంత్రి ప్రవర్తన, భాష చూస్తే పశువులు కూడా ఆయన్ను తన్నేలా వున్నాయంటూ చురకలంటించారు. అప్పలరాజు అవినీతిపై మావోయిస్టులు రెండుసార్లు లేఖలు రాశారని ధూళిపాళ్ల గుర్తుచేశారు. పశువుల దాణాకు సరఫరాను వైసీపీ ఎమ్మెల్యేకి చెందిన వల్లభ ఫీట్స్‌కు అప్పగించింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. మంత్రి పెద్దిరెడ్డి సొంత జిల్లాలో అమూల్ సంస్థ కోసం పాలు సేకరించే సత్తా జగన్‌కి, అప్పలరాజుకి వున్నాయా అని ధూళిపాళ్ల ప్రశ్నించారు. శ్రీజ డెయిరీని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాక్కున్నప్పుడు జగన్ ఏం చేశాడంటూ ఆయన చురకలంటించారు.
ALso Read:ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీలో గ్రూప్ పాలిటిక్స్.. రంగంలోకి మంత్రి పెద్దిరెడ్డి..!
ఇకపోతే.. విజయవాడలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో కన్నా లక్ష్మీనారాయణ, బొండా ఉమా, యడం బాలాజీ సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో కాపు సామాజికి వర్గానికి చెందిన నేతలు ఇలా భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే తన నివాసంలో జరిగిన భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని గంటా శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. మరోవైపు బొండా ఉమా కూడా ఇదే రకమైన సమాధానం చెప్పారు.
కొన్ని మీడియా చానల్స్ స్నేహపూర్వకంగా జరిగి సమావేశాన్ని వక్రీకరిస్తున్నాయని బొండా ఉమా అన్నారు. ఆ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు. ఓ వివాహానికి వచ్చిన సందర్భంగా మాత్రమే తాము కలిశామన్నారు. కుటుంబ వ్యవహారాలు, యోగ క్షేమాల గురించి ఈ సందర్భంగా మాట్లాడుకున్నామని చెప్పారు. వైజాగ్‌లో కాపునాడు సమావేశంపై ఎటువంటి చర్చ జరగలేదని చెప్పారు. వైజాగ్‌లో రంగా వర్ధంతికి సంబంధించిన పోస్టర్‌లను మాత్రమే గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారన్నారు.
పార్టీ మారే అంశంపై వస్తున్న వార్తలను గతంలోనే గంటా ఖండించారని అన్నారు. కాపు నాడు అనేది ఏ ఒక్కొరికో సంబంధించిన అంశం కాదని... అందిరితో కూడుకున్న అంశమన్నారు. ఈ 26వ తేదీన రంగా వర్ధంతి కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తున్నామని.. కాపు నాడు సభ మాత్రం కాదన్నారు. కాపులకు న్యాయం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని చెప్పారు.
