విజయవాడ: లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల భారాన్ని మోపిన జగన్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని మాజీ మంత్రి, టిడిపి నాయకులు దేవినేని ఉమామహేశ్వర రావు తెలిపారు. ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు మొదలు అందరూ ఇబ్బంది పడుతున్నారని... ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరెంటు బిల్లులు పెంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు నెలల బిల్లులు కలిపేసి కేటగిరీలు మార్చేసి ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తారా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి అని ఉమ డిమాండ్ చేశారు. 

''తెలుగుదేశం హయాంలో ఒక్కసారి కూడా కరెంటు చార్జీలు పెంచలేదు. సంవత్సరం తిరక్కుండానే కరెంటు చార్జీలు పెంచి ఇలా బిల్లులు పంపడానికి మించి అమానుషం, బాధ్యతారాహిత్యం ఏముంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పెరిగిన బిల్లులు కట్టడానికి ప్రజలు సిద్ధంగా లేరు. కరోనా భయంతో గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఇదేమీ లెక్కలేకుండా మీ ఖజానాను పెంచుకోడానికి సామాన్యులను దోచేస్తారా? కరెంటు బిల్లులు వసూలు కార్యక్రమాన్ని పక్కనపెట్టండి, మీ వసూళ్లు, దోపిడీని పక్కనపెట్టండి'' అంటూ వైసిపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

''మార్చి 20 తర్వాత లాక్ డౌన్ ప్రారంభమైంది. ఏప్రిల్ లో బిల్లు కట్టారు. మళ్లీ మీరు మార్చి, ఏప్రిల్ కలిపేసి బిల్లులు పంపిస్తారా? గొల్లపూడి లంబాడీపేటకు చెందిన గౌసియా బేగం అనే మహిళ రూ. 574 బిల్లు కట్టింది. ఆమెకు ఇవాళ 4, 652 బిల్లు వేశారు. నేను ఉన్నాను, నేను విన్నాను అంటే ఇదేనా ముఖ్యమంత్రి గారూ?'' అని ప్రశ్నించారు. 

''151 సీట్లు వచ్చాయని వైసీపీ విర్రవీగుతోంది. ఓ వైపు కరోనాతో ప్రజలు బాధపడుతుంటే రెండో పక్క కరెంటు బాదుడు. బిల్లులు కట్టకపోతే కరెంటు పీకేస్తామని అధికారులు బెదిరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో  కనెక్షన్లు తీసేశారు. జిల్లా కలెక్టర్లు, మంత్రులు ఏం చేస్తున్నారు? పెంచిన చార్జీలను వెనక్కు తీసుకోవాలి. చంద్రబాబు పిలుపు మేరకు వచ్చే వారం కరెంటు చార్జీల పెంపుకు నిరసనగా టీడీపీ శ్రేణులు నిరసన తెలుపుతాం'' అన్నారు. 

''కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ప్రజల కష్టాలపై పోరాడతాం. ప్రభుత్వం కళ్లు తెరిపిస్తాం. ఇష్టారాజ్యంగా రీడింగ్లు రాసేసి బిల్లులు ఇచ్చి కట్టమంటే కుదరదు. వెంటనే ప్రభుత్వం పెంచిన బిల్లులను వెనక్కు తీసుకోవాలి'' అని సూచించారు. 

''ఎల్జీ పాలిమర్స్ ఘటనపై మంత్రులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. పరిశ్రమ దగ్గర సీసీ ఫుటేజ్ ఎందుకు పెట్టలేదు? మూడు షిఫ్టుల్లో 45 మందికి జిల్లా యంత్రాంగం పాసులిచ్చింది. ఘటన సమయంలో 15 మందికి పాసులున్నాయి. సంఘటన జరిగినప్పుడు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారా? ఫ్యాక్టరీ దగ్గర సైరన్  ఎందుకు మోగలేదు?  పిల్లలను కోల్పోయిన బాధతో తల్లులు సోషల్ మీడియాలో మాట్లాడితే వారిపై కేసులు పెడతారా? పోయిన ప్రాణాలను తీసుకొస్తారా? సీసీ ఫుటేజ్ ఎందుకు బయటపెట్టడం లేదు?  అక్కడ ఏ ప్రాడెక్ట్ తయారైంది?  రవీంద్రనాథ్ రెడ్డి ఎవరు? సీఎం రిలీఫ్ కి ఈ ఎల్జీ కంపెనీ ఏమైనా డబ్బులు ఇచ్చిందా విజయసాయి ట్రస్ట్ కు ఈ కంపెనీ డబ్బులు ఇచ్చిందా?  విజయసాయి ఎందుకు విశాఖ రావడం లేదు? ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రిని, పార్టీలో నెంబర్ టూ అని చెప్పిన విజయసాయి ఏమయ్యాడు?'' అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 

''ఐటీ లెక్కలు దగ్గర పెట్టుకుని మరీ పారిశ్రామిక వేత్తల నుంచి విశాఖలో వందల కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేశారు. ముఖ్యమంత్రి రాజప్రసాదం నుంచి వీడియో బయటకు వచ్చింది. ఎల్జీ పాలిమర్ కు రా మెటీరియల్ ఎలా వెళ్తోంది?  ఎల్జీ పాలిమర్ లో పనిచేసే రవీంద్రారెడ్డి దళారీ పనులు చేస్తున్నాడు. వెంకటాపురం చుట్టుపక్కల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. వారికి కనీసం సమాధానం చెప్పడంలేదు. ఈ ఐదు రోజుల్లో పునరావాస కేంద్రాల్లో ఎంతమందికి భోజనం పెట్టారు?  ప్రైవేటు, గవర్నమెంట్ ఆస్పత్తుల్లో ఎవరెవరికి వైద్యం చేశారు?''ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. 

''ఎల్జీ పాలిమర్స్ ను కాపాడేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పర్యావరణ చట్టం ద్వారా రూ. 5 కోట్ల నష్టపరిహారం వస్తుంది. కానీ దానిపై సమాచారం లేదు. కంపెనీ ప్రతినిధులను ఎందుకు కాపాడుతున్నారు? సింహాచలం చుట్టుపక్కల 11 వందల ఎకరాలకు విజయసాయి అండ్ కో ఎందుకు మ్యాపింగ్ చేశారు?  విజయసాయి ఎందుకు మీడియా ముందుకు రావడం లేదు. ఎన్ని కోట్లు చేతులు మారోయో చెప్పాలి'' అన్నారు. 

''ఐదు కిలోమీటర్ల పైగా గ్యాస్ వ్యాపించింది. ప్రజలపై ఆ ప్రభావం పడే ప్రమాదం ఉంది. నిపుణుల సూచనలను పక్కనపెట్టి మంత్రులు మాట్లాడటమేంటి? భోపాల్ గ్యాస్ చట్టంలాంటిది విశాఖ గ్యాస్ చట్టం తెస్తానని ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడటం లేదు? ఎల్జీ యాజమాన్యాన్ని ఎందుకు కాపాడుతున్నారు? బాధితులకు కంపెనీ తరపున నష్టపరిహారం ఇప్పించే విషయంపై ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు? ఇంతవరకూ ఎల్జీ యాజమాన్యం అధికారికంగా ఒక్క మాట మాట్లాడలేదు'' అని అన్నారు. 

''చంద్రబాబు బాధితుల కష్టాలపై ప్రధానికి లేఖ రాశారు. విశాఖ ప్రజల తరపున ముఖ్యమంత్రి ఎందుకు లేఖ రాయడం లేదు? యాజమాన్యం నుంచి ఎందుకు డబ్బులు డిపాజిట్ చేయించడం లేదు? బాధిత కుటుంబాలకు కోటి ఇచ్చామని ఓ మంత్రి మాట్లాడుతున్నాడు. కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం లెక్కలేనితనం వల్లే ఈ పరిస్థితి. కరోనాతో సహజీవనం చేయమంటారా?'' అని నిలదీశారు. 

''చెయ్యాల్సిన పద్దతిలో కరోనా టెస్టులు చేయడం లేదు. కొరియా కిట్లతో పరీక్షలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అఖిలపక్షం నిర్వహించేందుకు ముఖ్యమంత్రికి తీరిక లేదు. మీడియా ముందుకొచ్చే ధైర్యం లేదు'' అని దేవినేని ఉమామహేశ్వర రావు మండిపడ్డారు.