వైసీపీ నేత, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ నేత దేవినేని ఉమా. వసంత కృష్ణప్రసాద్ 1999లో నాపై పోటీచేసి ఓటమి పాలై, హైదరాబాద్ వెళ్లి, రియల్ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.

కృష్ణప్రసాద్ అతని కుటుంబం ఎక్కడున్నా నేను ఎప్పుడూ పట్టించుకోలేదని ఉమా తెలిపారు. సీబీఐ, ఈడీ కేసుల్లో వసంత కృష్ణప్రసాద్ ముద్దాయిగా ఉన్నారని.. జగన్ అక్రమాస్తుల కేసుల్లో అతను కూడా ఒకరని దేవినేని గుర్తుచేశారు.

తనపై ఉన్న సీబీఐ, ఈడీ కేసులు వివరాలను కృష్ణప్రసాద్ ఎన్నికల అఫిడవిట్ లో చూపలేదని ఉమా వెల్లడించారు. అటువంటి వ్యక్తి సిగ్గులేకుండా శ్రీరంగ నీతులు చెబుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు.

కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ చేస్తున్న వసంత కృష్ణప్రసాద్ వేల ట్రిప్పుల గ్రావెల్ ను అమ్ముకుంటున్నాడని ఉమా ఆరోపించారు. దానిని అడ్డుకున్నాననే తనపై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం అవినీతిలో కూరుకుపోయిందని ఏసీబీ దాడులతోనే తేలిపోయిందని దేవినేని ఉమా వ్యాఖ్యానించారు. ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంపై రెండురోజులుగా ఏసీబీ దాడులు జరుగతున్నందుకు కృష్ణప్రసాద్ సిగ్గుపడాలన్నారు.

అతని అవినీతివల్ల తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, డిప్యూటీ సూపరిండెంట్ బలికాబోతున్నారని ఉమా చెప్పారు. వసంత, అతని బావమరిది ముంపు భూములు కొని, వాటిని మెరకచేయడం కోసం అటవీ భూమిని కొల్లగొట్టారని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.

సజ్జా అజయ్ పై దాడిచేసింది కృష్ణప్రసాద్ గూండాలేనని ఆయన ఆరోపించారు. తాడేపల్లి రాజప్రసాదంలో అవినీతిపై తేల్చుకుందామంటే కృష్ణప్రసాద్ పత్తాలేడని ఉమా మండిపడ్డారు.

గన్ తన అవినీతిని పసిగట్టి, ఏసీబీని వదిలాడన్న నిస్పృహతో  కృష్ణప్రసాద్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని దేవినేని వ్యాఖ్యానించారు. నోట్లు చించి 18వేలమందికి పంచి, గెలిచాక రూ.2వేలు ఇస్తానన్న విషయాన్ని కూడా వసంత, సీబీఐకి  లేఖ రాయాలని ఆయన డిమాండ్ చేశారు.

కృష్ణప్రసాద్ బంధువు టీచర్ పొదిల రవి హత్య కేసు విచారణ కూడా సీబీఐకి అప్పగించాలని ఉమా కోరారు.ఒక్కసారి గెలిచిన కృష్ణప్రసాద్ మిడిసిపడటం మానేసి, తన అవినీతిపై సీబీఐ విచారణ కోరాలని దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు.