విశాఖపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విషవాయువులు విడుదలై అయిదు కిలోమీటర్ల మేర ప్రజలు భయకంపితులను చేసిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటలనలో ఇప్పటికే 12 మంది మృత్యువాతపడగా వందల మంది తీవ్ర అస్వస్థతతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన కంపనీకి లాక్ డౌన్ సమయంలో అనుమతులిచ్చిన ప్రభుత్వం, అధికారులపై టిడిపి నాయకులు దేవినేని ఉమామహేశ్వర రావు ట్విట్టర్ వేదికన విరుచుకుపడ్డారు.  

''లాక్ డౌన్ సమయం లో ఎల్జీ పాలిమర్స్ కి అనుమతులు ఇప్పించిన పెద్దలు ఎవరు? ప్రాణాంతకమైన విషవాయువు వదిలి పుట్టిన ప్రాంతం నుంచి ప్రజల్ని పరుగులు పెట్టించిన కంపెనీ మంచిది ఎలా అవుతుంది?  కేంద్రాన్ని ఉన్నత స్థాయి విచారణ మీరు అడుగుతారా ప్రజలని అడగమంటారా చెప్పండి  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు'' అని ప్రశ్నించారు. 

''మీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే LG పొలిమెర్స్ విస్తరణకి అనుమతులు ఎలా ఇచ్చారు. మీరు పెట్టిన సెక్షన్ లు సరిపోతాయా...'' అంటూ ట్విట్టర్ వేదికన ముఖ్యమంత్రి జగన్ ను నిలదీశారు దేవినేని ఉమ. 

అంతకుముందు ఈ దుర్ఘటనపై స్పందిస్తూ ''విశాఖజిల్లా ఎల్ జి పోలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకైన ఘటనలో మరణించిన వారికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. బాధితులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్దిస్తున్నాను అధికారులు సహాయకార్యక్రమాలు ముమ్మరంచేసి చుట్టుపక్కలప్రాంతాల ప్రజలని భాదితులని పశుపక్ష్యాదులను త్వరితగతిన కాపాడాలి''     అంటూ ట్వీట్ చేశారు దేవినేని ఉమ.