శిశుపాలుడి లా జగన్ రెడ్డి పాపం పండింది...ఇక మిగిలింది పతనమే.. టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్
జగన్ రెడ్డి పాపం పండిందంటూ చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఇప్పటంలో పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా నెలకొన్న టెన్షన్ మీద ఆయన ట్వీట్ చేశారు.
గుంటూరు : ఈ వైసిపి ప్రభుత్వానికి పోయే కాలం దాపురించి దిక్కుమాలిన పనులు చేస్తుంది. శిశుపాలుడిలా జగన్ రెడ్డి వంద తప్పులు దాటాయి. ఇక మిగిలింది ప్రభుత్వ పతనమే. ఆంధ్రప్రదేశ్ అంటే హింస, దాడులు, కూల్చివేతలు, అడ్డగింతలు, అక్రమ అరెస్టులు అన్నట్లుగా మార్చేశారు.
ముఖ్యమంత్రి అహంకారానికి, అధికార మదానికి జవాబు చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు. 600 ఇళ్లున్న ఇప్పటం గ్రామంలో 120 అడుగులకు రోడ్డు విస్తరిస్తారా? మీ దుర్బుద్ధి, రాజకీయ కక్ష ప్రజలకు అర్థం కాదు అనుకుంటున్నారా? మీవి రోడ్లు వేసే మొహాలేనా?
ఇప్పటం గ్రామం వెళుతున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను అడ్డుకుంటేనో....చీకట్లో మా పర్యటనపై రాళ్లు వేస్తేనో మీరు పైచేయి సాధించలేరు. కూల్చడం మాని ఏదైనా కట్టి చూడండి...ఆ తృప్తి ఏంటో అర్థం అవుతుంది..అంటూ మండిపడ్డారు.
ఇదిలా ఉండగా, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శనివారం ఇప్పటం గ్రామ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పటం గ్రామం పోలీసుల వలయంలో చిక్కుకుపోయింది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అధికారులు నివాసాలు కూల్చివేశారు. అయితే, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కూల్చివేశారని జనసేన నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పవన్ కల్యాన్ తన పర్యటనలో కూల్చివేసిన నివాసాలను పరిశీలించనున్నారు. పవన్ పర్యటన నేపధ్యంలో ఇప్పటం గ్రామంలోని దివంగత మాజీ సీఎం వైఎస్సార్ విగ్రహాల వద్ద పోలీసులు కంచె ఏర్పాటు చేశారు.
ఇక ఆ తరువాత పార్టీ కార్యాలయం నుంచి ఇప్పటం గ్రామానికి బయలుదేరిన పవన్ కళ్యాణ్ ను పోలీసులు అడ్డుకున్నారు.
ఇప్పటం గ్రామానికీ వెళ్లేందుకు పోలీసులు అనుమతివ్వలేదు. దీంతో, పోలీసులు అడ్డుకోవడంతో నడుచుకుంటేనే ఇప్పటం గ్రామానికి బయలుదేరిన పవన్ కళ్యాణ్. అరెస్టు చేసుకుంటే అరెస్టు చేసుకోనివ్వండి అంటూ నడుచుకుంటూనే ఇప్పటం బయల్దేరారు.
ఇప్పటంలో ఆయన మాట్లాడుతూ.. మార్చిలో మా సభకు భూమి ఇస్తే, ఏప్రిల్ లో ఇళ్లను కూల్చేస్తామని నోటీసులు ఇచ్చారు. జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారనే కక్షతోనే ఇళ్లను కూల్చారు. ఎమ్మెల్యే ఆర్కే ఇళ్లు పెదకాకానిలో రహదారి విస్తరణ లేదా? అంటూ ప్రశ్నించారు. కనీసం మాట్లాడనీయకుండా ఆపడానికి మీరెవరు అంటూ మండిపడ్డారు.
కాకినాడ లేదా రాజమహేంద్రవరం రోడ్లు వెడల్పు చేయరా? అన్నారు. వైసీపీ నాయకులారా ఖబర్దార్..అన్నారు. ఇలాగే చేస్తే పులివెందులలో మీ మీద నుంచి హైవే వేస్తాం అని హెచ్చరించారు. మీరు రాష్ట్రంలో గుంతలు పూడ్చలేరు, కానీ ఇళ్లను కూల్చుతారు. పోలీసులు కూడా మన సోదరులే చేతులు కట్టుకొని నిరసనలు చేపట్టండి అంటూ పిలుపునిచ్చారు.