ఇటీవల విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో జరిగిన ఘటనకు సంబంధించి ఏపీ మహిళా కమీషన్ ఇచ్చిన నోటీసులపై టీడీపీ నేత బొండా ఉమ మండిపడ్డారు. కమీషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, మంత్రి రోజాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఇటీవ‌ల విజయవాడ ప్రభుత్వ ఆసుప‌త్రిలో (vijayawada govt hospital) మతిస్థిమితం లేని యువ‌తిపై సామూహిక అత్యాచారం (vijayawada gang rape) )జ‌రిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఆ యువ‌తి కుటుంబాన్ని టీడీపీ (tdp) ఆదుకుంది. ఈ మేరకు రూ.5 లక్షల చెక్కును బాధిత కుటుంబానికి అందించింది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న టీడీపీ నేత బోండా ఉమ (bonda umamaheswara rao) ఏపీ మంత్రి రోజాపై (rk roja) మండిప‌డ్డారు. రోజా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదని, వనజాక్షి, కాల్ మనీ సెక్స్ రాకెట్ అంటూ టీడీపీపై విమర్శలు చేయ‌డం ఏంట‌ని ఆయన మండిపడ్డారు.

వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా.. ఇన్నాళ్లూ ఏం చేశారని బొండా ఉమ ప్రశ్నించారు. ఇక‌నైనా రోజా సొల్లు మాటలు చెప్పడం మానుకోవాలని, వైసీపీ ప్రభుత్వ పాల‌న‌లో 800 మంది మహిళలపై దాడులు జరిగితే ఏం చేశారని ఆయ‌న నిల‌దీశారు. విజయవాడ ఆసుప‌త్రిలో సామూహిక అత్యాచారానికి గురైన యువ‌తి కుటుంబానికి టీడీపీ అండగా ఉందని, అందుకే మ‌హిళా క‌మిష‌న్ నుంచి తమకు నోటీసులు ఇచ్చారని బొండా ఉమా ఆరోపించారు.

అస‌లు మహిళా కమిషన్‌కు ఉన్న అధికారాల గురించి వాసిరెడ్డి పద్మ (vasireddy padma ) చదివారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఆమె రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని, ఆ పదవి నుంచి ఆమెను తప్పించాలని సీఎస్, జాతీయ మహిళా కమిషన్‌ను బొండా ఉమ డిమాండ్ చేశారు. వాసిరెడ్డి పద్మ మేకప్ వేసుకుని తీర్పులు చెప్పొచ్చని అనుకుంటున్నారేమోనంటూ ఆయ‌న ఎద్దేవా చేశారు. మహిళా కమిషన్ ఇచ్చిన సమన్ల వ‌ల్ల‌ తమ వెంట్రుక కూడా ఊడదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

మరో టీడీపీ నేత బుద్ధా వెంకన్న మాట్లాడుతూ... విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచారం జరిగితే.. బాధితురాలిని పరామర్శించడానికి వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు.. మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. నోటీసులిస్తే జగన్ వద్ద మార్కులు పడతాయని వాసిరెడ్డి పద్మ భావిస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు ఇచ్చిన నోటీసు చెత్త కాగితంతో సమానమన్నారు. 

సీఎం జగన్‌ను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని అన్నారు. పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వకుంటే అప్రూవరుగా మారతానని విజయసాయి రెడ్డి జగన్‌కు స్పష్టం చేశారని చెప్పుకొచ్చారు. విజయసాయి రెడ్డికి సీఎం జగన్ పక్కన పెట్టారని తాము అనడం లేదని, వైసీపీ నేతలే అంటున్నారన్నారు. విజయసాయిరెడ్డికి ఉన్నట్టుండి కీలక బాధ్యతలు అప్పగించడానికి బ్లాక్‌మెయిల్ చేయడమే కారణమని అన్నారు.