వాలంటీర్లతో అన్యమత ప్రచారం... ఆ మతంలో చేరితేనే ప్రభుత్వ పథకాలట: బోండా ఉమ

గత ఏడాది నెల్లూరులోని బిట్రగుంట వేంకటేశ్వరస్వామి ఆలయంలో రథం దగ్ధమైందని ఆనాడే ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని ఉంటే నేడు అంతర్వేది ఆలయంలో రథం దగ్ధమయ్యేది కాదన్నారు టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ. 

tdp leader bonda umamaheshwar rao demands CBI inquiry on antarvedi chariot fire accident

అమరావతి: వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల హిందూ ధార్మికసంస్థలు, హిందూమతం, దేవాలయాలపై దాడులు జరగడమే కాకుండా మతమార్పిడులు రాష్ట్రంలో విచ్చలవిడిగా పెరిగాయని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.ప్రభుత్వ ఉదాసీనత వల్లే హిందువుల ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఆలయ భూములు ఆక్రమణలకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బోండా ఉమ ఆరోపించారు. 

''గత ఏడాది నెల్లూరులోని బిట్రగుంట వేంకటేశ్వరస్వామి ఆలయంలో రథం దగ్ధమైంది. ఆనాడే ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని ఉంటే నేడు అంతర్వేది ఆలయంలో రథం దగ్ధమయ్యేది కాదు. పరమ పవిత్రమైన తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరగడమే కాదు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అన్యమతస్తులను టీటీడీలో ఉద్యోగులుగా నియమించారు. విశాఖపట్నంలో మకాం వేసి సింహాచలం అప్పన్నస్వామి భూములను కాజేశారని, అక్కడ ఈవోగా ఉన్న అధికారి ప్రభుత్వ దురాగతాలకు తట్టుకోలేక రాజీనామా చేసి వెళ్లిపోయింది నిజం కాదా?'' అని బొండా ప్రశ్నించారు.

 శ్రీశైలం దేవస్థానంలో కోట్లరూపాయల విలువచేసే టిక్కెట్ల కుంభకోణం జరిగినా, భక్తుల సొమ్ముని కొట్టేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ఎన్నడూ లేని అక్రమాలు జరుగుతున్నాయని, స్థానికంగా ఉన్న మంత్రి గుడిని, గుడిలో లింగాన్ని మింగేలా తయారయ్యాడని, కమీషన్ల పేరుతో ఆలయ మర్యాదలను అపవిత్రం చేశాడని ఉమా మండిపడ్డారు. ఆఖరికి అర్చకుల పళ్లెల్లో వేసే సొమ్ముని కూడా వదలకుండా మింగుతున్నాడన్నారు. కరోనా పేరుచెప్పి స్థానిక వ్యాపారుల నుంచి రూ.10కోట్లవరకు వసూలు చేసినా ప్రభుత్వం సదరు మంత్రిపై చర్యలు తీసుకోలేదన్నారు. 

ప్రభుత్వ నిర్లక్ష్యం, ఉదాసీనత వల్లే అరాచకశక్తులు హిందూ దేవాలయాలపై దాడులుచేస్తూ రథాలు తగులబెట్టారన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు అన్నిమతాలకు  రక్షణగా నిలిచి, ప్రజలకు సమస్యలు లేకుండా చేస్తే ఈ ప్రభుత్వం అరాచకశక్తులను ప్రోత్సహిస్తోందన్నారు. పిఠాపురంలో 23 దేవాలయాలపై దాడిచేసి విగ్రహాలను ధ్వంసం చేశారన్నారు. హిందువులు పరమపవిత్రంగా భావించే దేవాలయాలపై దుండగులు, ముష్కరులు తెగబడుతుంటే, ప్రభుత్వం చోద్యంచూస్తూ కూర్చుందని మండిపడ్డారు. 

read  more   విశాఖ నుండి అంతర్వేదికి... బిజెపి ఎమ్మెల్సీ అరెస్ట్ (వీడియో)

ముఖ్యమంత్రి 30నెలలకు మంత్రి పదవిస్తే దాన్ని అడ్డంపెట్టుకొని  ఇప్పటికే  30ఏళ్లకు సరిపడా దోచేశాడని, రాష్ట్రంలో ఆలయాలపై ఇన్ని అరాచకాలు జరుగుతుంటే దేవాదాయశాఖా మంత్రి టీడీపీపై, చంద్రబాబుపై విమర్శలు చేస్తూ తప్పించుకుంటున్నాడన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ తక్షణమే తన పదవికి రాజీనామా చేసి, చేసిన తప్పులను ఒప్పుకోవాలని బొండా డిమాండ్ చేశారు.  

ఆఖరికి ఈప్రభుత్వం మత మార్పిడులను ప్రోత్సహించేందుకు వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుంటోందని, ప్రభుత్వ పథకాలు సకాలంలో అందాలంటే పలానా మతంలోకి రావాలని చెప్పడం సిగ్గుచేటన్నారు.  వైసీపీ ప్రభుత్వ15నెలల పాలనలో ఎన్నడూలేని విధంగా హిందూ ధార్మికసంస్థలపై ఎందుకుదాడులు జరుగుతున్నా యో ప్రజలకు తెలియాలంటే తక్షణమే జరిగిన సంఘటనలపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీనేత డిమాండ్ చేశారు. 

సింహాచలం దేవాలయ భూముల అమ్మకాల్లో,  శ్రీశైలం టిక్కెట్ల కుంభకోణంలో, దుర్గగుడిలో జరుగుతున్నఅవకతవకల్లో మంత్రి వెల్లంపల్లి ప్రమేయం ఉన్నందున, ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండి మౌనంగా ఉంటేసరిపోదని, హిందూమతంపై, దేవాలయాలపై జరుగుతున్న దాడులపై సమాధానంచెప్పాలని బొండా నిలదీశారు. హిందూమతంపై దాడులు చేయిస్తే, ప్రజలు భయపడి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే మతంలోకి మారతారనే ఉద్దేశంతోనే పాలకులు ఇటువంటి దురాగతాలు చేయిస్తున్నారన్నారు.  అంతర్వేధి రథం తగులబెట్టించడం దేనికో, తిరిగి కొత్తది నిర్మిస్తామని చెప్పడం దేనికో చెప్పాలన్నారు. 

అధికారంలో ఉన్న జగన్ జరిగిన ఘటనలకు బాధ్యత వహించాలి గానీ, ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఎలా బాధ్యుడవుతాడని బొండా ప్రశ్నించారు. శ్రీవారి పింక్ డైమండ్ మాయమైందని, దాన్ని చంద్రబాబు ప్రభుత్వం విదేశాలకు తరలించిందని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టినవారు ఇప్పుడు దానిపై ఎందుకు విచారణ జరపలేదో సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వ అండదండలు లేకుండా కొన్ని లక్షలమంది మనోభావాలతో ఆటలాడే దుస్సాహాసానికి సామాన్యుడు ఒడిగట్టడని, అంతర్వేది రథం దగ్ధం వెనుక ఎవరున్నారో తేలాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గమన్నారు.  

ప్రతిపక్షసభ్యులు తమ దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతారని, దానిపై విచారణ జరిపి నిజానిజాలు నిగ్గుతేల్చాల్సిన బాధ్యత పాలకులదేనన్నారు. దేవాదాయ మంత్రి అవినీతి లీలలు ప్రజలకు తెలియాలంటే అతన్ని తక్షణమే పదవినుంచి తప్పించి, సీబీఐ విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని బొండా స్పష్టంచేశారు.   

రాష్ట్రచరిత్రలో ఏనాడూ లేనివిధంగా హిందువులపై, దేవాలయాలపై, దాడులు జరుగుతున్నా, ఆలయాల భూములు అన్యాక్రాంతమవుతున్నా పీఠాధిపతులు ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నిచడం లేదన్నారు. ప్రమాణస్వీకారం నాడు ముఖ్యమంత్రిని ముద్దుపెట్టుకొని మరీ ఆశీర్వదించిన విశాఖ పీఠాధిపతికి రాష్ట్రంలో హిందూసంస్కృతిపై,ఆలయాలపై జరుగుతున్న దాడులు కనిపించడంలేదా? అని బొండా నిలదీశారు. ఎవరి సంతోషం కోసం, ఎవరి స్వలాభంకోసం పీఠాధిపతులు హిందూమతాన్ని ప్రభుత్వానికి తాకట్టుపెట్టాలనుకుంటున్నారో సమాధానం చెప్పాలన్నారు బోండా ఉమా. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios