కేశినేని నాని ఓ అప్పుల అప్పారావు, మరో బిల్డప్ బాబాయ్..: బోండా ఉమ
విజయవాడ ఎంపీ కేశినేని నాని పైకి అంబానీలా బిల్డప్ ఇచ్చే అప్పుల అప్పారావు అని టిడిపి నేత బోండా ఉమ ఎద్దేవా చేసారు. రెండుసార్లు ఎంపీగా పోటీచేసిన నాని రెండుపైసలు కూడా ఖర్చుచేయలేదని... అయినా ఎలా గెలిచాడో చెబుతానంటూ ఉమ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
విజయవాడ : ఇటీవలే వైసిపిలో చేరి టిడిపి నాయకులపై విమర్శలు చేస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నానికి బోండా ఉమ కౌంటర్ ఇచ్చారు. ఎంపీ పదవిని అడ్డం పెట్టుకుని నాని భారీ అవినీతికి పాల్పడ్డాడని... దీంతో అతడి అప్పులు తగ్గి ఆస్తులు పెరిగిపోయాయని ఆరోపించారు. ఈ మేరకు కేశినేని నాని ఆస్తులు, అప్పుల వివరాలను బోండా ఉమ బైటపెట్టారు.
బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను నమ్మించడంలో... రుణాలు తీసుకుని ఎగ్గొట్టడంలో నాని ఆరితేరిపోయాడని ఉమ ఆరోపించారు. బ్యాంకులను ముంచేవారిలో ఈయన ఒకరని అన్నారు. అతడి పేరుతో వున్న హోటల్ సహా ఇతర వ్యాపారాలన్ని దివాళాతీసే స్థాయిలో వున్నాయని... ఇవి బయటపడకుండా బయటకు బిల్డప్ ఇస్తుండాలని అన్నారు. నాని ఓ అప్పుల అప్పారావు, బిల్డప్ బాబాయ్ అని బోండా ఉమ మండిపడ్డారు.
ఆంధ్రా అంబానీని అని ప్రచారం చేసుకుని టిడిపిలో చేరిన కేశినేని నాని ఎంపీ టికెట్ తీసుకున్నాడని ఉమ తెలిపారు. ప్రజల కోసం పనిచేస్తానంటే నమ్మిన చంద్రబాబు విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చాడన్నారు. నానికి టికెట్ ఇప్పించింది... సొంత డబ్బులు ఖర్చుచేసి గెలిపించింది సుజనా చౌదరి అని అన్నారు. 2014 ఎన్నికల్లో కేశినేని నాని పార్టీ కోసం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు... అయినా చంద్రబాబు దయతో గెలిచాడని ఉమ తెలిపారు.
ఇక 2019లో చంద్రబాబును ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి కేశినేని నాని మళ్లీ ఎంపీ టిక్కెట్ తెచ్చుకున్నాడని అన్నారు. ఈసారి ఆయనకు లోకేష్ టికెట్ ఇప్పించారన్నారు. ఇలా రెండుసార్లు ఎంపీగా అవకాశం ఇచ్చిన పార్టీకోసం నాని రెండు రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదన్నారు. కానీ అతడు మాత్రం బాగానే సంపాదించుకున్నాడని ఆరోపించారు. 2019 ఎన్నికల అఫిడవిట్ లెక్కల ప్రకారం ఐదేళ్లలోనే ఆయన ఆస్తులు 100 శాతం పెరిగాయి... అప్పులు తగ్గాయని ఉమ వెల్లడించారు.
Also Read Andhra Pradesh Election 2024 : ఇక జనసైనికులకు మాస్ జాతరే ... సినిమా స్టైల్లో పవన్ ఎలక్షన్ క్యాంపెయిన్
కేశినేని నాని వల్ల టిడిపికి ఏమాత్రం లాభం జరక్కపోగా నష్టం జరిగిందన్నారు. తెలియకుండానే అతడి స్కాములకు అండగా నిలిచామని... అందుకు ఇప్పుడు సారీ చెప్పాల్సి వస్తోందన్నారు. అతడివల్ల పార్టీ కూడా విమర్శలు ఎదుర్కొందన్నారు.
టిడిపిని వీడి వైసిపిలో చేరిన నాని చివరకు ఆ పార్టీ సభలకు జనాన్ని సప్లై చేసే స్థాయికి దిగజారిపోయాడని ఎద్దేవా చేసారు. అతడికి ఎంపీ టికెట్ ఇస్తామని వైసిపి నమ్మిస్తోంది... కానీ చివరకు అతడికి మొండిచేయి చూపించడం ఖాయమన్నారు. నాని అన్నం పెట్టిన ఇంటికే సున్నం పూసే రకం... అతడిని ఎవరూ నమ్మరన్నారు. జగన్ ఇంట్లో బూట్లు తుడుస్తారో... బాత్రూంలు కడుగుతారో తమకు అనవసరం... కానీ చంద్రబాబు గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే ఇక ఊరుకోబోమని ఉమ హెచ్చరించారు.
ప్రస్తుతం జగన్ దొడ్డిలో మొరిగే కుక్కలా ఉన్న కేశినేని నాని... తర్వాత పిచ్చికుక్కలా మారి జగన్ మీదకే వెళ్లడం ఖాయమన్నారు. టిడిపి దయ, భిక్షతోనే గతంలో నాని గెలిచాడన్నారు. దమ్ముంటే ఇప్పుడు తనతో నాని పోటీపడాలని... అతడికి డిపాజిట్ కూడా రాదని బోండా బోండా ఉమ అన్నారు.