Andhra Pradesh Election 2024 : ఇక జనసైనికులకు మాస్ జాతరే ... సినిమా స్టైల్లో పవన్ ఎలక్షన్ క్యాంపెయిన్
పవన్ కల్యాణ్ జనసైనికుల్లోనే కాదు తెలుగు తమ్ముళ్లలో జోష్ నింపేందుకు సిద్దమయ్యారు. ఎన్నికల్లో టిడిపి-జనసేన కూటమి సమన్వయంతో ఎలా ముందుకు వెళ్లాలో దిశానిర్దేశం చేయనున్నారు పవన్. ఇందుకోసం ఆయన ప్రయాణం ఎలా సాగనుందంటే....
అమరావతి : టిడిపితో కలిసి పోటీకి సిద్దమైన జనసేన సీట్లపంపకం విషయంలో ఓ క్లారిటీకి వచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో ఇక ప్రచారాన్ని హోరెత్తించేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ సిద్దమయ్యారు. ముందునుండి ఉభయ గోదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టిన జనసేన అక్కడినుండే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తోంది. తక్కువ సమయంలోనే రాష్ట్రం మొత్తాన్ని కవర్ చేసేలా పవన్ ప్రచారం సాగనుందట ... ఇందుకోసం ఇప్పటికే ప్రత్యేక హెలికాప్టన్ ను సిద్దం చేసినట్లు జనసేన ప్రచార కమిటీ వెల్లడించింది.
టిడిపి-జనసేన కూటమి తరపున మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ పవన్ పర్యటించేలా షెడ్యూల్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో హెలికాప్టర్ ల్యాండింగ్ కు హెలిప్యాడ్ ఏర్పాటుచేయనున్నారు. ఇందుకోసం అనువైన స్థలాన్ని గుర్తించాలని ఇప్పటికే టిడిపి-జనసేన కూటమి నాయకులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఇలా గాల్లో చక్కర్లుకొడుతూ జెట్ స్పీడ్ లో పవన్ ప్రచారం సాగనుందని కూటమి నాయకులు చెబుతున్నారు.
ప్రతి జిల్లాకు పవన్ మూడుసార్లు వెళ్లేలా ప్రణాళిక సిద్దం చేసినట్లు జనసేన ప్రకటించింది. మొదటిసారి జిల్లా ముఖ్యనేతలతో, రెండోసారి స్థానిక కార్యకర్తలతో సమావేశం, మూడోసారి ప్రజల్లోకి వెళ్లి ప్రచారం, బహిరంగ సభల్లో పవన్ పాల్గొంటారని ప్రకటించారు. ఇందులో భాగంగానే ఉభయ గోదావరి జిల్లాల్లో ఫిబ్రవరి 14 అంటే రేపటి నుండి జనసేనానిని పర్యటన ప్రారంభం కానుందని ఆ పార్టీ ప్రకటించింది.
Also Read చంద్రబాబు లగ్జరీ చూసి ప్రధానే ఆశ్చర్యపోయేవారు... తమతో ఇలాగనేవారు..: కేశినేని నాని
రాబోయే నాలుగురోజులు అంటే ఫిబ్రవరి 14,15,16,17 తేదీల్లో ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో పవన్ పర్యటించనున్నారు. రేపు (బుధవారం) ఉదయం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం నుండి భీమవరంకు పవన్ పయనం కానున్నారు. ఇందుకోసం హెలికాప్టర్ రెడీగా వున్నట్లు జనసేన నాయకులు చెబుతున్నారు. ఈ హెలికాప్టర్ ల్యాండింగ్ కు భీమవరంలోని విష్ణు కాలేజీ ప్రాంగణంలో హెలిప్యాడ్ ను కూడా సిద్దం చేసారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ముఖ్య నాయకులతో పాటు గెలుపోటములను ప్రభావితం చేసే ముఖ్యులతో పవన్ భేటీ కానున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులతోనూ పవన్ సమావేశం కానున్నారు. నియోజకవర్గాల వారిగా టిడిపి-జనసేన నాయకుల మధ్య సమన్వయంపై చర్చించి ఏవయినా సమస్యలుంటే పరిష్కారానికి ప్రయత్నించనున్నారు. విబేధాలుంటే పక్కనపెట్టి టిడిపి-జనసేన కూటమి అభ్యర్థి గెలుపుకోసం కృషి చేయాలంటూ నాయకులను దిశానిర్దేశం చేయనున్నారు పవన్.
భీమవరం పర్యటనను ముగించుకుని తిరిగి హెలికాప్టర్ లో మంగళగిరికి చేరుకోనున్నారు పవన్. ఆ తర్వాతిరోజు (ఫిబ్రవరి 15 గురువారం) అమలాపురం, ఫిబ్రవరి 16 శుక్రవారం కాకినాడ, ఫిబ్రవరి 17 శనివారం రాజమండ్రిలో పవన్ పర్యటించనున్నారు. ఉదయం ఆయా జిల్లాలకు వెళ్లి తిరిగి రాత్రికి మంగళగిరికి చేరుకునేలా పవన్ షెడ్యూల్ ను రూపొందించారు జనసేన నాయకులు.