పార్టీ మార్పుపై స్పందించారు టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు. విజయవాడలోని ఆయన నివాసంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కాపునేతలు సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ మార్పు అంశం మా భేటీలో జరగదని స్పష్టం చేశారు.

కాపు అభ్యర్ధులకు పార్టీ నుంచి సరైన సహకారం అందలేదని బొండా ఉమా ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో వచ్చిన ఇబ్బందులను అధినేత దృష్టికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ఉమా స్పష్టం చేశారు.

బీజేపీలోకి వెళ్లడానికి ఇన్ని సమావేశాలు అక్కర్లేదని.. మా ఆలోచన పార్టీ మార్పు కాదన్నారు. అధినేత ఇచ్చిన హామీని బట్టే మా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని ఉమా స్పష్టం చేశారు.

చంద్రబాబుకు చెప్పే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నామని బొండా తెలిపారు. ఈ సమావేశంలో తోట త్రిమూర్తులు, బడేటి బుజ్జి, పంచకర్ల రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కాపు నేతలు టీడీపీ చీఫ్ చంద్రబాబుతో భేటీ కానున్నారు.