జగన్! తప్పుకో, చంద్రబాబు చేసి చూపిస్తారు: మోడీపై టీడీపీ నేత అయ్యన్న సంచలన వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోడీపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం చితిమంటల వెలుగులో వెలిగిపోతోందని ఆయన వ్యాఖ్యానించారు. తప్పుకుంటే చంద్రబాబు చేసి చూపిస్తారని ఆయన అన్నారు.

TDP leader Ayyannapatrudu challenges Narendra Modi on Coronavirus

నర్సీపట్నం: కరోనా కట్టడి విషయంలో ప్రధాని నరేంద్ర మోడీపై తెలుగుదేశం పార్టీ నాయకుడు అయ్యనపాత్రుడు సంచలన వ్యాఖ్యలుచేశారు. మోడీ హయాంలో చితిమంటల వెలుగులో భారతదేశం వెలిగిపోతోందని ఆయన అన్నారు. పరిపాలన చేతకాకపోతే తప్పుకోవాలని, చంద్రబాబు చేసి చూపిస్తారని ఆయన ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. మిగిలిన అన్ని శాఖల పనులను తాత్కాలికంగా ఆపేసి, వాటి నిధులను ఆరోగ్యానికి ఖర్చు చేయాలని ఆయన అన్నారు. పనిచేయని తమ ముఖ్యమంత్రి వైఎస్ జనగ్ మీద చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.  

ముందు చూపు లేకపోవడం, నాయకత్వ లోపం వల్లనే దేశంలో, రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో కరోనా లెక్కలన్నీ తప్పుల తడకలేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రులూ అధికారుల వరకు కరోనాను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. సాక్షాత్తూ న్యాయస్థానాలకు తప్పు సమాచారం ఇస్తున్నారని ఆయన విమర్శించారు.

పాడేరు, అనకాపల్లిల్లో గతంలో సరఫరా చేసిన వెంటిలేటర్లు ఖాళీగానే ఉన్నాయని, శిక్షణ గల వైద్యులు లేకపోవడం వల్లనే అలా ఉన్నాయని కలెక్టర్ అంటున్నారని ఆయన అన్నారు. వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి 104కు ఫోన్ చేసినా స్పందన రాలేదని, అదీ దాని పనితీరు అని ఆయన అన్నారు.

మంత్రి వర్గ సమావేశంలో వరుసలో 32వ స్థానంలో కోరనాను చేర్చారంటే దానికి సీఎం జగన్ ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. దోచుకోవడం, దాచుకోవడం తప్పించి, ప్రజాసంక్షేమంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios