Asianet News TeluguAsianet News Telugu

నేను నర్సీపట్నంలోనే ఉన్నా.. అప్పుడు ఎవరు పులో తెలిపోతుంది: విజయసాయిరెడ్డికి అయ్యన్నపాత్రుడు సవాలు

వైసీపీ ఎంపీ విజయసారెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనను ఎదుర్కోవడానికి రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా నర్సీపట్నంలోనే ఉందన్నారు. దమ్ముంటే నేరుగా నర్సీపట్నం రావాలని విజయసాయిరెడ్డికి సవాలు విసిరారు. 
 

TDP Leader Ayyanna Patrudu Challenge to YSRCP MP Vijayasai reddy come narsipatnam
Author
First Published Jun 25, 2022, 12:21 PM IST

వైసీపీ ఎంపీ విజయసారెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటీవల నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత తొలిసారిగా ట్విట్టర్ వేదికగా స్పందించిన అయ్యన్నపాత్రుడు.. విజయసాయిరెడ్డిపై విమర్శలు చేశారు. తనను ఎదుర్కోవడానికి రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా నర్సీపట్నంలోనే ఉందన్నారు. ‘‘జేసీబీలు, ఐపీఎస్‌లు, ఆర్డీవోలు, వందల సంఖ్యలో పోలీసులు, పదుల సంఖ్యలో పోలీసు వాహనాలు, సోషల్ మీడియా కేసులు. అంత భయం ఎందుకు సాయి రెడ్డి? దమ్ముంటే నేరుగా నువ్వే నర్సీపట్నం వచ్చేయ్ తేల్చుకుందాం’’ అని ట్విట్టర్ వేదికగా సవాలు విసిరారు. 

ఇక, తాజాగా విజయసాయి రెడ్డిపై అయ్యన్నపాత్రుడు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘16 నెలలు చిప్పకూడు తినడం వలన శరీరం మందపడింది. తోటి ఖైదీలు, ఖాకీల చేతిలో తిన్న దెబ్బల వలన ఏర్పడ్డ చారలు చూసుకొని విజయ సాయి రెడ్డి పులి గా ఫీల్ అవ్వడంలో తప్పు లేదు. బెయిల్ కోసం ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానికి ఢిల్లీ వెళ్లిన నువ్వు నన్ను అజ్ఞాతంలో ఉన్నావనడం విడ్డూరంగా ఉంది. అంత గొప్పగా ఉంది నీ ప్రభుత్వ సమాచార వ్యవస్థ. నేను నర్సీపట్నంలోనే ఉన్నా. ముహూర్తం ఎందుకు నువ్వు ఎప్పుడొచ్చినా నేను రెఢీ. అన్నట్టు పులి అయితే పోలీసుల్ని వేసుకొని రాదుగా సింగిల్ గా రావాలి. అప్పుడు తేలిపొద్ది ఎవడు పులో ఎవడు పిల్లో!’’ అని అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు. 

ఇక, ఆదివారం తెల్లవారుజామున అయ్యన్న ఇంటికి వెళ్లిన మున్సిపల్‌ సిబ్బంది.. ప్రహరీని పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేశారు. అయ్యన్నపాత్రుడు తన ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వ భూమిలో రెండు సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారని మున్సిపల్ అదికారులు ఆరోపిస్తున్నారు. దీనిపై నోటీసులు ఇచ్చినా ఆయన నుంచి స్పందన లేదని చెబుతున్నారు. అయ్యన్న స్పందించకపోవడంతోనే ప్రహరీ గోడ కూల్చివేత చేపట్టినట్లు వెల్లడించారు. అయితే కూల్చివేతను అయ్యన్న కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

అయితే ఇంటి గోడ కూల్చివేత ప్రక్రియను నిలువరించాలని కోరుతూ అయ్యన్నపాత్రుడి కుమారులు విజయ్‌, రాజేష్‌‌లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.   దీనిపై బుధవారం జరిగిన విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వీవీ సతీష్‌ వాదనలు వినిపిస్తూ.. ఆమోదం పొందిన ప్లాన్‌ ప్రకారం నిర్మాణం చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తహసీల్దార్‌, జలవనరులశాఖ అధికారులు పరిశీలించి హద్దులు నిర్ణయించాకే నిర్మించారని పీవీ సతీష్ తెలిపారు. రాజకీయ కక్షతో.. నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతలు ప్రారంభించారని ఆయన వాదించారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఇంటి గోడ నిర్మించుకునేందుకు పిటిషనర్లకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios