Asianet News TeluguAsianet News Telugu

జగన్ రెడ్డీ గుర్తుంచుకో...అధికారం శాశ్వతం కాదు: అచ్చెన్నాయుడు హెచ్చరిక

కడప జిల్లాలో టిడిపి జడ్పిటిసి జయరామిరెడ్డిపై జరిగిన దాడిని ఖండించిన అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

TDP Leader Atchannaidu serious on  AP CM YS Jagan AKP
Author
First Published Jun 6, 2023, 4:34 PM IST

అమరావతి : ప్రతిపక్ష టిడిపి నాయకులపై జరుగుతున్న వరుస దాడులపై ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. టిడిపి నాయకులపైనే కాదు వారి కుటుంబసభ్యులపైనా దాడులు, ఆస్తులు ధ్వంసానికి పాల్పడుతున్నది వైసిపి రౌడీమూకలేనని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ దురాగతాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని... ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే శాంతిభద్రతలు కరువయ్యాయని అచ్చెన్నాయుడు అన్నారు. 

ఇటీవల టిడిపి నాయకులపై వైసిపి దాడులు మరీ ఎక్కువయ్యాయని... మొన్న నెల్లూరులో ఆనం వెంకటరమణారెడ్డిపై, నిన్న కొండేపిలో బాలవీరాంజనేయ స్వామిపై వైసిపి మూకలు దాడికి పాల్పడ్డాయని అన్నారు. ఇక టంగుటూరులో సుధాకర్ అనే నాయకుడు టిడిపిలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడని కక్షగట్టిన వైసిపి రౌడీలు దారుణానికి ఒడిగట్టారని అన్నారు. సుధాకర్ పై కోపంతో ఆయన భార్యను ట్రాక్టర్ తో తొక్కించి మరీ అతి దారుణంగా చంపేసారని అచ్చెన్నాయుడు అన్నారు. 

తాజాగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత జిల్లా కడపలో టీడీపీ జడ్పీటీసీ జయరామిరెడ్డిపై జరిగిన దాడిని అచ్చెన్నాయుడు ఖండించారు. గోపవరం జడ్పీటీసీ ఇంట్లోకి చొరబడ్డ వైసిపి రౌడీలు కర్రలతో దాడికి దిగి జయరామిరెడ్డిని తీవ్రంగా గాయపర్చారని... ఇది జగన్ రెడ్డి సైకో పాలనకు నిదర్శనమని అన్నారు.రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్షాలపై దాడులు చేస్తుంటే జగన్ రెడ్డి సంతోషిస్తున్నాడని... అలాంటి వ్యక్తిని సైకో కాకుంటే ఇంకేమంటారు? అంటూ ఎద్దేవా చేసారు. 

Read More నా సోదరుడు వీరాంజనేయస్వామి భయపడే రకం కాదు... ఎదిరించి పోరాడతాడు..: చంద్రబాబు

రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు సక్రమంగా డ్యూటీ చేయడంలేదని అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రలో అలజడి సృష్టిస్తున్న వైసీపీ రౌడీమూకలను కట్టడి చేయడం మాని వత్తాసు పలుకుతూ చోద్యం చూస్తున్నారని అన్నారు. చివరకు సీఎం జగన్ రెడ్డి సొంత జిల్లాలోనూ శాంతిభద్రతలు కరువయ్యాయని అన్నారు. ప్రతిపక్ష నేతలపై వైసీపీ గూండాల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని అచ్చెన్నాయుడు అన్నారు. 

అధికారం శాశ్వతం కాదని జగన్ రెడ్డితో పాటు ఆయన ముఠా గుర్తిస్తే మంచిదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. జగన్ రెడ్డి పతనం కడప నుంచే ప్రారంభమవుతుందని అన్నారు. జయరామిరెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు ఏదైనా జరగరానిది జరిగితే జగన్ రెడ్డే బాధ్యత వహించాలని అన్నారు. టిడిపి జడ్పిటిసిపై దాడికి పాల్పడ్డ నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరారు అచ్చెన్నాయుడు. 

Follow Us:
Download App:
  • android
  • ios