రాజకీయాల్లో పొత్తులు అనేవి సహజం అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. పొత్తుల గురించి తప్పుడు ప్రచారం చేసేవాళ్లు పిచ్చివాళ్లు అని విమర్శించారు.

రాజకీయాల్లో పొత్తులు అనేవి సహజం అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. పొత్తుల గురించి తప్పుడు ప్రచారం చేసేవాళ్లు పిచ్చివాళ్లు అని విమర్శించారు. దేశంలో పొత్తులు అనేవి సర్వసాధారణ విషయం అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలో నుంచి దించడానికి 100 పార్టీలు ఒకటయ్యాయని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిందని ఆరోపించారు. ప్రజా స్వామ్యాన్ని కాపాడుకునేందుకే కలిసొచ్చే పార్టీలను కలుపుకుని పోతామని చెప్పారు. 

సీఎం జగన్ దోపిడీ రాజధానిగా విశాఖను మారుస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు విశాఖలో దోపిడీకి తెగబడుతున్నారని మండిపడ్డారు. వారి దోపిడీని అడ్డుకుంటామనే తమపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఉత్తరాంధ్రలో మంత్రుల దోపిడీ ప్రజలందరికీ కనిపిస్తోందని అన్నారు. రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితికి ఏపీని తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. నేతల స్వార్ధం కోసమే ప్రాంతీయ చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అంటే జే గ్యాంగ్ అడ్డా కాదని అన్నారు. రుషికొండను కొల్లగొట్టి కట్టుకునే ప్యాలెస్ తో ఏం సాధిస్తారని ప్రశ్నించారు.

రైతుల పాదయాత్రపై వైసీపీ నేతలు దండయాత్ర చేస్తున్నారన్నారని మండిపడ్డారు. మూడున్నరేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం 40ఏళ్ళు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. పులివెందులలో కూడా గెలవలేని జగన్.. 175 సీట్లు గెలుస్తామనే భ్రమ కల్పిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు తనకు ఎందుకు ఓటేయాలో చెప్పే ఒక్క మంచి కారణం కూడా జగన్ వద్ద లేదని అన్నారు. ప్రభుత్వ శాఖలు అన్నింట్లోనూ సాక్షి సిబ్బందిని పెట్టి వారిపై సజ్జల పర్యవేక్షణ చేస్తున్నారని విమర్శించారు. సాక్షి పాలేగాళ్లు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.