ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం, మంత్రులు బయటకొస్తే జనం బలవ్వాలా అని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం, మంత్రులు బయటకొస్తే జనం బలవ్వాలా అని ప్రశ్నించారు. శనివారం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రులు ర్యాలీలు, సంబరాలతో అమాయకుల ప్రాణాలు తీస్తున్నారన్నారని ఆరోపించారు. కళ్యాణదుర్గంలో చావుబతుకుల్లో ఉన్న చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్తుంటే కనీసం దారి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. వైద్యం అందించడం ఆలస్యమై పండు అనే చిన్నారి మృతి చెందిందని, ఈ ఘటన చాలా బాధ కలిగించిందని అన్నారు.
కనీసం బాధితులను పరామర్శించేంత ఓపిక, సమయం కూడా మంత్రికి లేదా అని ప్రశ్నించారు. సీఎం కారు ఎక్కితే చాలు షాపులు మూసివేసి.. లోపలే ఉండాలని హెచ్చరిస్తున్నారనిచెప్పారు.
ఈ ఘటనకు సంబంధించి ట్విట్టర్ వేదికగా స్పందించిన అచ్చెన్నాయుడు.. పాప మృతికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ‘‘ప్రజలను కాపాడాల్సిన పోలీసులు వారి ప్రాణాలు తీస్తున్నారు. వైసీపీ మంత్రి పర్యటన కోసం పోలీసులు చేసిన అతి ప్రవర్తన వల్ల, ఒక ఏడాది పాప మృతి చెందడం అత్యంత బాధాకరం. అనారోగ్యంతో ఉన్న పాపను ఆసుపత్రికి తీసుకు వెళుతున్న తల్లిదండ్రులను అడ్డుకొని, ఆ పాప మృతికి కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు.
ఇక, అనంతపురంలోని కళ్యాణదుర్గంలో తీవ్ర అనారోగ్యంతో ఉన్న చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళుతున్న వాహనాన్ని మంత్రి ఉషాశ్రీ చరణ్ ఉరేగింపు పేరుతో కోసం పోలీసులు నిలిపివేశారు. అరగంట తర్వాత ట్రాఫిక్‌ను తిరిగి వదిలారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లేసరికి పాప మృతిచెందింది. దీంతో సకాలంలో ఆస్పత్రికి చేర్చలేకపోవడంతో పాప మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు అడ్డుకోకుంటే పాప బతికి ఉండేదని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నారి మృతదేహంతో టీ సర్కిల్‌లో కొన్నిగంటలపాటు నిరసన తెలిపారు.
