చంద్రబాబు అరెస్టైనా ప్రజలు రావట్లే.. అందరూ రంగంలోకి దిగండి: అచ్చెన్నాయుడి ఆడియో లీక్
చంద్రబాబు అరెస్టయినా ప్రజలు పెద్దగా రోడ్లపై నిరసన చేయడం లేదని, కాబట్టి, టీడీపీ నేతలంతా రంగంలోకి దిగి ప్రజా సమీకరణ చేయాలని పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు దిశానిర్దేశం చేశారు. జనసమీకరణ కోసమే ఆయన ఓ టెలీకాన్ఫరెన్స్ చేపట్టారు. ఇందుకు సంబంధించి ఓ ఆడియో క్లిప్ లీక్ అయింది.

అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అరెస్టు ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేస్తున్నాయి. అయితే.. ప్రజలు పెద్దగా రావడం లేదని స్వయంగా టీడీపీ సీనియర్ లీడర్ పేర్కొనడం సంచలనంగా మారింది. అందుకే అందరూ రంగంలోకి దిగి జన సమీకరణ చేయాలని దిశా నిర్దేశం చేస్తున్న ఆడియో క్లిప్ ఒకటి లీక్ అయింది. అచ్చెన్నాయుడు టీడీపీ నేతలతో జన సమీకరణ కోసం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఆయన మాటలకు సంబంధించిన ఆడియో ఒకటి లీక్ అయింది.
టీడీపీకి చంద్రబాబు అరెస్టు కావడానికి మించిన అంశం మరొకటి ఉండదని అచ్చెన్నాయుడు అన్నారు. కాబట్టి, టీడీపీ లీడర్, క్యాడర్ అంతా ఈ అరెస్టును నిరసించడంలోనూ మునిగి ఉంటారని బయటి వారు కూడా అంచనా వేస్తారు. కానీ, చంద్రబాబు నాయుడు అరెస్టుతో రాష్ట్రం అగ్గిగుండం అవుతుందని, ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేస్తారని భావించారు. కానీ, అలా పెద్ద మొత్తంలో ప్రజలు రావడం లేదని కొందరు బయటి వారు తనకు ఫోన్ చేసి చెప్పారని అచ్చెన్నాయుడు ఆ టెలీకాన్ఫరెన్స్‌లో పేర్కొన్నట్లు ఆ క్లిప్ లో ఉంది.
Also Read: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం .. చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్
ప్రజలు పెద్దగా రోడ్లపైకి రావడం లేదని అచ్చెన్నాయుడు అన్నారు. మొబిలైజేషన్ ఎక్కువగా లేదని, కాబట్టి, అందరూ రంగంలోకి దిగి జన సమీకరణ చేయాలని టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అంతేకాదు, మహిళలను పోలీసులు అడ్డుకోవడం లేదని గుర్తించినట్టు వివరించారు. కాబట్టి, ఆ జనసమీకరణలో మహిళలు కూడా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్ ఇప్పుడు సంచలనంగా మారింది. అధికార వైసీపీకి టీడీపీపై విమర్శలు చేయడానికి మరో అస్త్రం దొరికినట్టయింది.
వైరల్ అవుతున్న ఆ ఆడియో క్లిప్ ఎంత వరకు నిజమైందనేది తేలాల్సి ఉంది. ఆడియో క్లిప్ మాత్రం విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది.