అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ. సీఎంగా వైయస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి జరుగుతున్న సమీక్షల్లో జగన్ పక్కన పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డిలే తప్ప ఇంకెవరు కనిపించడం లేదన్నారు. 

కీలక సమీక్షల్లో సీఎం జగన్ కు ఇరువైపులా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయిరెడ్డిలు తప్ప ఎవరూ ఉండరని విమర్శించారు. డిప్యూటీ సీఎం పదవి ఇస్తే సామాజిక న్యాయం జరిగినట్లేనా అంటూ నిలదీశారు. 

మరోవైపు గత ప్రభుత్వంలో జరగని అవినీతిని బయటకు తీయాలంటూ మంత్రులు, అధికారులపై జగన్ తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. లేని అవినీతిని ఎక్కడ నుంచి తీసుకురావాలో తెలియక ఉద్యోగులు, మంత్రులు తలలుపట్టుకుంటున్నారని చెప్పుకొచ్చారు. 

గృహ నిర్మాణ పథకంలో అవినీతి జరిగిందంటూ వైయస్ జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ అంటూ నానా హంగామా చేస్తూ ప్రజల్లో టీడీపీని దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్నారంటూ అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఏపీలో రైతు సమస్యలను పరిష్కరించడంలో వైయస్ జగన్ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబుట్టారు. వరుస సమీక్షలు చేస్తున్న వైయస్ జగన్ విత్తనాల పంపిణీపై ఒక్కసారైనా సమీక్ష చేశారా అంటూ మండిపడ్డారు. విత్తనాలు సరఫరా చేయలేక జగన్ ప్రభుత్వం డీలా పడిందని అనురాధ ఆరోపించారు.