గుంటూరు: మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామ లేక మధ్యయుగంలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతోందని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. అధికార మదంతో అచ్చోసిన ఆంబోతులా రోడ్డుపై పడిన మంత్రి కొడాలి నానిని అదుపు చేయడం చేతకాని ముఖ్యమంత్రికి  మహిళలపై పోలీసులతో జులుం చేయించే అధికారం ఎవరిచ్చారు? అని ఆమె నిలదీశారు.

''కొడాలి నానికి అహంకారం తలకెక్కి కన్నూ మిన్నూ కానడం లేదు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా అవి. కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా దేవినేని ఉమా మహేశ్వర రావు శాంతియుతంగా చేస్తున్న దీక్షకు మహిళలు మద్దతు తెలపడం తప్పెలా అవుతుంది? ఆయన  అరెస్ట్ ను అడ్డుకున్న మహిళలపై పోలీసులను ఉసిగొల్పి ఇష్టానుసారంగా దాడి చేస్తారా? మీ ఇంట్లో ఆడపడుచుల పట్ల ఇలాగే ప్రవర్తిస్తారా?'' అని ప్రశ్నించారు.

read more  మంత్రి పేకాట దందా పట్టుకున్న...ఆ ఎస్సైది ఆత్మహత్యా, హత్యా?: చంద్రబాబు సంచలనం

''దేవినేని ఉమా దీక్షతో వైసీపీ నేతల వెన్నులో వణుకు మొదలైంది. అందుకే దీక్షను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు రకరకాలు జిమ్మిక్కులు చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎవ్వరికీ రక్షణ లేకుండా పోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక మహిళలపై 400కు పైగా అఘాయిత్యాలు జరిగితే ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి ప్రోద్బలంతోనే ప్రతిపక్ష నేతలపై కక్షపూరితంగా దాడులు చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడినా చర్యలుండవు.  మాజీ మంత్రిని మంత్రి ఇంటికొచ్చి కొడతానన్నా ముఖ్యమంత్రికి వినబడదు. రాష్ట్రాన్ని మధ్యయుగం వైపు నడిపించాలని కంకణం కట్టుకున్నారా ముఖ్యమంత్రి గారూ?'' అని నిలదీశారు.

''రౌతును బట్టే గుర్రం, నాయకుడిని బట్టే నేతలు . ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదని అధికార వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలి. ఇంకోసారి వైసీపీ నేతలు, వారికి ఊడిగం చేస్తున్న పోలీసులు...మహిళల జోలికొస్తే కీళ్లు విరగొట్టి కూర్చోబెడతారు. నిరంకుశ పోకడలతో విర్రవీగుతున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజల చేతిలో చీపురు దెబ్బలు తప్పవు'' అని అనిత హెచ్చరించారు.