కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రాజకీయం వేడెక్కింది. వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవికి టీడీపీ నేత, మాజీమంత్రి భూమా అఖిలప్రియ సవాల్‌ విసిరారు. దమ్ముంటే సుబ్బారాయుడు హత్య కేసులో భూమా కుటుంబానికి సంబంధం ఉందని వారం లోపు నిరూపించాలని ఆమె సవాల్ విసిరారు.

దీనిని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, తమపై తప్పుడు కేసులు పెడితే విడిచిపెట్టనని హెచ్చరించారు. శిల్పా రవి నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.

నంద్యాల డివిజన్‌లో ఏది జరిగినా భూమా కుటుంబం మీద బురదజల్లుతున్నారని మండిపడ్డారు. శిల్పా రవి పుట్టక ముందే తన తండ్రి భూమా నాగిరెడ్డి రాజకీయాల్లో ఉన్నారని, తన తండ్రి మీద కేసుల మీద కేసులు పెట్టి హింసించారని అఖిలప్రియ ఆరోపించారు.

కాగా, ఇటీవల నంద్యాలలో వైసీపీ నేత, న్యాయవాది సుబ్బరాయుడుని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. వాకింగ్‌కు వెళ్లిన సమయంలో కర్రలతో కొట్టి ఆయన్ను చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది