ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ నేత ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టీడీపీ సీనియర్ నేత, మాజీ విప్ కూన రవికుమార్.. అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించినందుకు ఆయనపై కేసు నమోదయ్యింది. దీంతో ఆయన వెంటనే అజ్ఞాతం లోకి వెళ్లారు. తర్వాత ముందుస్తు బెయిల్ సంపాదించి ఇటీవల ఆయన తన స్వస్థలానికి చేరుకున్నారు.

స్వస్థలానికి చేరుకున్న ఆయనకు అనుచరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కూన రవికుమార్ అనుచరుడు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు సభ్యుడు శాసన సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది మళ్లీ మరో వివాదానికి దారి తీసే పరిస్థితి కనిపిస్తోంది. కూన రవికుమార్‌ తొలుత ర్యాలీగా పట్టణంలోకి రావాలని భావించారు. దీనికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వాహనాలతో స్థానిక ఎస్‌ఎస్‌ఎన్‌ కళ్యాణమండపానికి చేరుకున్నారు.

అక్కడ సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలను రెచ్చగొడుతూ కొంతమంది మాట్లాడారు. ఆమదాలవలస మండలంలోని కనుగులవలస గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు నూక సూరప్పల నాయుడు అలియాస్‌ రాజు స్పీకర్‌ తమ్మినేని సీతారాంను, ఆయన హోదాను కించపరిచే విధంగా కార్యకర్తల ముందు మైక్‌లో రెచ్చిపోయారు. స్పీకర్‌ తనయుడు తమ్మినేని చిరంజీవి నాగ్‌ సర్టిఫికేట్‌లు కొనుగోలు చేసి చదువుకున్నట్లు బిల్డప్‌ ఇస్తున్నారని విమర్శించి, పత్రికలో రాయలేని విధంగా స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాగా... అతను చేసిన కామెంట్స్ పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.