విజయవాడ: తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఉండి ఏపీలో వైసీపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని వడ్డెర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవళ్ళ మురళీ విమర్శించారు. బీసీలకు ఒక్క పాలకమండలి కూడా ఏర్పాటు చేయని నీచమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ ప్రభుత్వమేనని ఆయన మండిపడ్డారు. 

టీడీపీ ప్రభుత్వంలో బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా ఎంతో అభివృద్ధి చెందారని మురళి శుక్రవారం మీడియా సమావేశంలో అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకు కూడా మంత్రివర్గాన్నే ఏర్పాటు చేసుకోవడం చేతకాని మీరు ఏపీకి వచ్చి నీతులు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. 

మార్చి2న హైదరాబాద్‌లో చర్చకు రావాలని ఆయన తలసానికి సవాల్‌ విసిరారు. కేవలం మంత్రి పదవి కోసమే తలసాని చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలను విస్మరించడమే కాకుండా పక్క రాష్ట్రానికి వచ్చి బీసీలపై అనుచితంగా మాట్లాడితే సహించేది లేదని ఆయన అన్నారు.