First List: హైదరాబాద్ నుంచి ఏపీకి చంద్రబాబు, పవన్.. రేపు మధ్యాహ్నం టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితా?
టీడీపీ, జనసేన పార్టీల అభ్యర్థుల తొలి ఉమ్మడి జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నది. రేపు మధ్యాహ్నం తొలి జాబితా విడుదల చేయనున్నట్టు తెలిసింది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి చంద్రబాబు, లోకేశ్ ఉండవల్లికి, పవన్ కళ్యాణ్ అమరావతికి వెళ్లారు.
ఏపీలో టీడీపీ, జనసేన కూటమి కసరత్తులో ముందడుగు పడింది. రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీతో చాలా మందికి అనుమానాలు తొలగిపోయాయి. బీజేపీ నుంచి ఇంకా సస్పెన్స్ ఉన్నప్పటికీ టీడీపీ, జనసేనల మధ్య ఒక స్పష్టమైన అవగాహన ఉన్నట్టు తేలిపోయింది. ఉమ్మడి మ్యానిఫెస్టోపై కసరత్తు జరుగుతున్నది. 28న తాడేపల్లి గూడెంలో ఉమ్మడిగా బహిరంగ సభను నిర్వహిస్తామని ఇది వరకే ప్రకటించారు. ఇక సీట్ల సర్దుబాట్లపైనా పలుమార్లు భేటీ అయ్యారు. అభ్యర్థుల ఎంపిక కూడా వేగంగా జరుగుతున్నది. శనివారం మధ్యాహ్నం ఈ రెండు పార్టీల అభ్యర్థుల తొలి ఉమ్మడి జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నది.
రేపు మంచి రోజు కావడంతో తొలి జాబితా విడుదల చేయాలని ఉభయ పార్టీల అధినేతలు డిసైడ్ అయినట్టు తెలిసింది. 70 నుంచి 80 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసే ఈ మొదటి జాబితాను విడుదల చేసే ఛాన్స్ ఉన్నది.
బీజేపీ కూడా పొత్తులో ఉండనుంది. కాబట్టి, కొన్ని సీట్లు ఆ పార్టీ కోసం కూడా రిజర్వ్ చేసి ఉంచవచ్చు. అలాగే.. వివాదం లేని స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నది. ఎందుకంటే కొన్ని స్థానాల్లో ఒకటి కంటే ఎక్కువ మంది ఆశావహులు పోటీ పడుతున్నారు. కొన్ని చోట్ల టీడీపీ, జనసేన పార్టీల నుంచి టికెట్ కోసం తీవ్ర పోటీ ఉన్నది. కాబట్టి, అలాంటి స్థానాల జోలికి తొలి జాబితాలో వెళ్లకపోవచ్చు. బీజేపీతో కూడా సీట్ల విషయంపై స్పష్టత వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నది.
Also Read: Delhi Liquor Scam: లోక్ సభ ఎన్నికల వేళ కవితకు షాక్.. లిక్కర్ కేసులో అరెస్టుకు రంగం సిద్ధం?
ఈ జాబితాను విడుదల చేయడానికి ఇప్పటికే హైదరాబాదన్ నుంచి పవన్ కళ్యాణ్ అమరావతికి, చంద్రబాబు, లోకేశ్‌లు ఉండవల్లికి వెళ్లిపోయారు. రేపు మధ్యాహ్నం ఈ తొలి జాబితాను విడుదల చేయనున్నట్టు తెలిసింది.