Asianet News TeluguAsianet News Telugu

తెలుగు తాలిబాన్ పార్టీకి అధ్యక్షుడు చంద్రబాబు: వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్

తెలుగు దేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. తన వ్యాఖ్యలను టీడీపీ నేతలు కావాలనే వక్రీకరిస్తున్నారని, వారి లక్ష్యం ఒకే కుటుంబంలా కలిసి ఉంటున్న ఎస్సీ, బీసీ, మైనార్టీల మధ్య కుల చిచ్చు పెట్టడమేనని ఆరోపించారు. అంతేకాదు, టీడీపీని తెలుగు తాలిబాన్ పార్టీ అని, తాలిబాన్ పార్టీకి అధ్యక్షుడు చంద్రబాబు అని వ్యాఖ్యలు చేశారు.
 

tdp is telugu taliban party says ysrcp mla jogi ramesh
Author
Amaravati, First Published Aug 21, 2021, 6:09 PM IST

అమరావతి: తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు దేశం పార్టీని తెలుగు తాలిబాన్ పార్టీగా పేర్కొన్నారు. ఆ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉన్నారని అన్నారు. తన మాటలను వక్రీకరించారని పేర్కొంటూ గతంలో చంద్రబాబు దళితులపై అంగీకారయోగ్యం కాని వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. దళితుల్లో పుట్టాలని, దళిత వాడాల్లో పెరగాలని ఎవరు కోరుకుంటారు? అని చంద్రబాబు గతంలో కామెంట్ చేశాడన్నారు. అంతేకాదు, విశ్వ బ్రాహ్మణుల తోకలు కట్ చేస్తారని, అగ్నికుల క్షత్రియులను తరిమికొడతారని నోరుపారేసుకున్నాడని చెప్పారు.

రాష్ట్రంలో ఎస్సీ, బీసీ, మైనార్టీలు ఒకే కుటుంబంలా కలిసి మెలిసి ఉన్నారని, కానీ, చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెట్టాలని కుటిల యత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు. బలహీనవర్గాలు అంబేద్కర్‌ను దేవుడిలా పూజిస్తున్నారని వివరించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా బడుగువర్గాల పక్షపాతి అని పేర్కొన్నారు. అన్‌రిజర్వ్‌డ్ స్థానాల్లో 75 కార్పొరేషన్‌లలో ఎక్కువ శాతం బలహీనవర్గాలకే ఇచ్చారన్నారు. 

తాను అంబేద్కర్, సీఎం జగన్ గురించి మాట్లాడిన మాటలను వక్రీకరించారని టీడీపీపై పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. టీడీపీ నేతలు విచ్ఛిన్న ఆలోచనలతో విషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? అని ప్రశ్నించిన చంద్రబాబుపై కేసు పెట్టాలా?లేక ఉరి తీయాలా? అని అన్నారు. కానీ, సీఎం జగన్ మోహన్ రెడ్డి బలహీన వర్గాలను బలమైన వర్గంగా మారుస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలను టీడీపీ జీర్ణించుకోలేక పోతున్నదని, పేదులకు ఇళ్లు పట్టాలు ఇస్తున్నా ఆ పార్టీ నేతలు కోర్టులకు వెళ్తున్నారని చెప్పారు. కానీ, వాస్తవాలేమిటో అందరికీ తెలుసని, బడుగువర్గాలు సీఎం జగన్‌కు జేజేలు పలుకుతాయని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios