Asianet News TeluguAsianet News Telugu

సెంటిమెంట్ సెగ్మెంట్ ఇదే: కేటీఆర్ కు సీటు దక్కేనా...

ఇలాంటి తరుణంలో బొత్సను ఢీకొట్టాలంటే అది కేటీఆర్ తోనే సాధ్యమని టీడీపీకి చెందిన కొందరు నేతలు భావిస్తున్నారు. బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగువెలిగిన సమయంలో కూడా కేటీఆర్ తెలుగుదేశం పార్టీకి వీరవిధేయుడిగా పనిచేస్తూ నియోజకవర్గ కేడర్ ను కాపాడారని చెప్తున్నారు. 
 

TDP is facing trouble in Cheepurupalli segment
Author
Vizianagaram, First Published Feb 5, 2019, 5:09 PM IST


విజయనగరం: తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్రలోనే ఆ నియోజకవర్గం కంచుకోట. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరు నిలబడినా గెలుపొందాల్సిందే. కులాలతోకానీ, ప్రాంతాలతో కానీ సంబంధం ఉండదు తెలుగుదేశం అభ్యర్థి అయితే చాలు ఇక గెలుపు నల్లేరుపై నడకే. 

అలాంటి కంచుకోట రాబోయే ఎన్నికల్లో బద్దలయ్యే అవకాశం ఉందా...తెలుగుదేశం జెండా రెపరెపలాడే అవకాశం కనిపించడం లేదా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా మరి ఆ నియోజకవర్గానికి వచ్చిన చిక్కేంటి...బీటలు వారడానికి గల కారణాలేంటి.....

అంతేకాదండోయ్ ఆ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ కూడా ఉంది. అలాగే ఒక సారి గెలిచిన అభ్యర్థి మరోసారి గెలుస్తారు అనే ఆనవాయితీ కూడా ఉంది. ఇన్ని విశిష్టతలు కలిగిన నియోజకవర్గం ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా... అయితే విజయనగరం జిల్లా వెళ్లాల్సిందే. 

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం. ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 2014 ఎన్నికల వరకు టీడీపీ జెండా రెపరెపలాడింది. అయితే మధ్యలో తెలుగుదేశం పార్టీ కంచుకోటను చీల్చి కాంగ్రెస్ జెండా ఎగురవేశారు మాజీ పీసీసీ చీఫ్ ప్రస్తుత వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. 

2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014 ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశం పార్టీ గెలిచింది. తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగించడంతో మళ్లీ తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వచ్చినట్లేనని నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు భావించారు.  

అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో సీఎం స్థాయి వ్యక్తిగా వెలుగొందిన బొత్స సత్యనారాయాణ లాంటి వ్యక్తిని ఓడించి తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించిన మృణాళినికి మంత్రి పదవి సైతం కట్టబెట్టారు చంద్రబాబు నాయుడు. 

అయితే ఆమె మంత్రి పదవిని రెండున్నరేళ్లకే కోల్పోవాల్సి వచ్చింది. అందుకు నియోజకవర్గంలో ఆమెకు ఎదురైన ప్రతికూల పరిస్థితులే కారణమని ప్రచారం జరుగుతోంది. ఇకపోతే మాజీమంత్రి మృణాళిని వ్యవహార శైలిపై చీపురుపల్లి తెలుగుతమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. 

ఆమె నియోజకవర్గంలోని క్యాడర్ ని పట్టించుకోవడం లేదని స్థానికులకు అందుబాటులో ఉండటం లేదని తెలుగుతమ్ముళ్లు వాపోతున్నారు. అంతేకాదు నియోజకవర్గ ప్రజలు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలతో మృణాళిని మమేకం కాలేకపోయారని, కలిసి తమ సమస్యలు చెప్పుకుందామని వస్తే సరిగ్గా స్పందించలేదని ఆరోపిస్తున్నారు. 

ఇప్పటికే ఆమెకు స్థానిక నేతల పేర్లు కూడా తెలియదని వాపోతున్నారు. అలాగే ఆర్.ఈ.సి.ఎస్ లో కుంభకోణం, ఉద్యోగ నియామకాలలో అవినీతి, ఎల్ఈడీ విద్యుత్ దీపాలలో రూ.40లక్షలు అవినీతి జరిగిందంటూ ప్రచారం రావడంతో ప్రజలు ఆమెపై గుర్రుగా ఉన్నారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో ఆమెకు టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని తెలుగుతమ్ముళ్లే స్పష్టం చేస్తున్నారు. ఆమెకు సీటిస్తే టీడీపీ క్యాడర్ సహకరించదని ప్రచారం చేస్తున్నారు. మృణాళి వ్యవహారశైలి నచ్చక చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసీపీలో చేరిపోయారని ఇప్పుడు ఆమెకు టికెట్ ఇస్తే దెబ్బతినే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 

ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ నియోజకవర్గ ఇన్ చార్జ్ కుచ్చర్లపాటి త్రిమూర్తులు పేరును తెరపైకి తీసుకువస్తున్నారు. త్రిమూర్తులు రాజు కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహమే లేదు. కుచ్చర్లపాటి త్రిమూర్తుల రాజును తెలుగుతమ్ముళ్లు నియోజకవర్గ ప్రజలు ఆప్యాయంగా కేటీఆర్ అని పిలుచుకుంటారు. 

2004,2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన బొత్స సత్యనారాయణ మంత్రిగా, పీసీసీ చీఫ్ గా ఎంపికై రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న తరుణంలో కూడా కేటీఆర్ మాత్రం టీడీపీ వీడలేదు. అలాగే పార్టీ క్యాడర్ ను కాపాడుకుంటూ వచ్చారు. 

ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి అలుపెరగని కృషి చేశారని తెలుగుతమ్ముళ్లు చెప్తున్నమాట. 2019ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యడం దాదాపు ఖాయమైపోయింది. 

ఇలాంటి తరుణంలో బొత్సను ఢీకొట్టాలంటే అది కేటీఆర్ తోనే సాధ్యమని టీడీపీకి చెందిన కొందరు నేతలు భావిస్తున్నారు. బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగువెలిగిన సమయంలో కూడా కేటీఆర్ తెలుగుదేశం పార్టీకి వీరవిధేయుడిగా పనిచేస్తూ నియోజకవర్గ కేడర్ ను కాపాడారని చెప్తున్నారు. 

అంతేకాదు 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చెయ్యాలని కేటీఆర్ భావించారు. నియోజకవర్గ ఇంచార్జ్ అయిన తనకు కాకుండా ఇంకెవరికి ఇస్తారన్న ధీమాతో నామినేషన్ కూడా వేసేశారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిమిడి మృణాళినిని అభ్యర్థిగా ప్రకటించింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం. 

మృణాళిని అభ్యర్థిత్వాన్ని పలువురు తెలుగుతమ్ముళ్లు బాహటంగా వ్యతిరేకించినా చంద్రబాబు ఆదేశాలతో కేటీఆర్ తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకుని మృణాళిని గెలుపులో కీలక పాత్ర పోషించారని చెప్తుంటారు. 

బొత్స లాంటి వ్యక్తిని ఢీకొట్టడం అంటే సామాన్య విషయం కాదని నాన్ లోకల్ అయిన మృణాళిని వల్ల అసలు సాధ్యమయ్యే పనికాదని అయితే కేటీఆర్ కీలకంగా వ్యవహరించడంతో ఆమె గెలుపొందారన్నది బహిరంగ రహస్యం.   

తెలుగుదేశం పార్టీకి వీరవిధేయుడుగా ఉంటూ పార్టీకోసం అహర్నిశలు శ్రమిస్తున్న కేటీఆర్ కు ఈసారి టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు పట్టుబడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో కేటీఆర్ కు న్యాయం జరగలేదని ఈసారైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని చెప్తున్నారు. 

కేటీఆర్ కు నియోజకవర్గంలో మాంచి పట్టు ఉందని అలాగే ప్రజల్లో కూడా సానుభూతి ఉందని చెప్తున్నారు. అలాగే బొత్స సత్యనారాయణకు మంచి పట్టు ఉన్న మెరకముడిదాం మండలంలో కేటీఆర్ కు కూడా పట్టు సాధించారని చెప్తున్నారు.  

ఇప్పటికైనా చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కేటీఆర్ అలియాస్ కుచ్చర్లపాటి త్రిమూర్తులు రాజును ప్రకటించాలని కోరుతున్నారు. అటు మాజీమంత్రి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మృణాళిని సైతం మరోసారి పోటీ చెయ్యాలని ఆశపడుతున్నారు. 

తనకు కాకపోతే తన కుమారుడు నాగార్జునకు అయినా ఇవ్వాలని చంద్రబాబుకు మెురపెట్టుకున్నారని తెలుస్తోంది. మరి చంద్రబాబు ఎవరిని బరిలోకి దించుతారో అన్నది సస్పెన్షన్. చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తిని ఢీ కొట్టేందుకు చంద్రబాబు వేరే వ్యక్తిని ఎవరినైనా బరిలోకి దించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కూడా ప్రచారం జరుగుతుంది. వెయిట్ అండ్ సీ.  

Follow Us:
Download App:
  • android
  • ios