Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ స్కెచ్: జగన్ రంగంలోకి దిగేలోపు ఆమెను లాగెయ్యాలి

విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గానికి టీడీపీ కొత్త అభ్యర్థిని బరిలో దించాలని యోచిస్తుందా...సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్న అసంతృప్తి వల్ల ఆయనకు చెక్  పెట్టే అవకాశం ఉందా...వైసీపీ అభ్యర్థిని బలంగా ఢీకొట్టే సరైన అభ్యర్థిని వెతికి  పనిలో పడిందా...అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.  
 

tdp invites ycp leader savarapu jayamani to offer parvathipuram seat
Author
Vizianagaram, First Published Jan 3, 2019, 10:52 AM IST

విజయనగరం: విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గానికి టీడీపీ కొత్త అభ్యర్థిని బరిలో దించాలని యోచిస్తుందా...సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్న అసంతృప్తి వల్ల ఆయనకు చెక్  పెట్టే అవకాశం ఉందా...వైసీపీ అభ్యర్థిని బలంగా ఢీకొట్టే సరైన అభ్యర్థిని వెతికి  పనిలో పడిందా...అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.  

పార్వతీపురం నియోజకవర్గానికి ప్రస్తుతం బొబ్బిలి చిరంజీవులు ఎమ్మెల్యేగా పని చేస్తున్నారు. అయితే ఆయనకు నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తోందని సర్వేలో తేలింది. దీంతో పార్వతీపురం నియోజకవర్గంలో గెలుపు గుర్రం కోసం టీడీపీ అన్వేషించే పనిలో పడింది.  

ఎస్సీ రిజర్వుడ్ కావడంతో ఆ సామాజిక వర్గంలో మంచి పలుకుబడి ఉన్న నేతలను వెతికే పనిలో పడ్డారు టీడీపీ నేతలు. బలమైన అభ్యర్థి కోసం వెతుకుతున్న టీడీపీ నేతల కన్ను పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే  వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, వైసీపీ మధ్యపాన నిషేధ కమిటీ మెంబర్ సవరపు జయమణిపై పడిందంట. 

2009లో దివంగత సీఎం వైఎస్ఆర్ ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆమె హయాంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని మంచి పేరుంది. అన్నివర్గాల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని ప్రజల్లో మాంచి టాక్. 

స్వతహాగా సౌమ్యురాలు, మృదుస్వభావి అయిన జయమణి వివాదాలకు ఎంత దూరంగా ఉంటారో పార్టీ కార్యకర్తలకు అంతే దగ్గరగా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు ఆమె ఎమ్మెల్యేగా పనిచేసిన 2009 నుంచి 2014 కాలమే సమాధానం. 

సవరపు జయమణి కింది స్థాయి నుంచి అంచలంచెలుగా ఎమ్మెల్యేగా ఎదిగారు. ఎంపీటీసీగా గెలిచిన ఆమె ఎంపీపీ అయ్యారు. ఆ తర్వాత జెడ్పీటీసీగా గెలుపొందారు. 2009లో ఎమ్మెల్యే అయ్యారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆమె 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆమెకు సముచిత స్థానం కల్పించారు అధినేత వైఎస్ జగన్. జయమణిని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించడంతో పాటు, వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర మధ్యపాన నిషేధ కమిటీ మెంబర్ బాధ్యతలూ అప్పగించారు. 

అప్పటి నుంచీ జయమణి వైఎస్ఆర్ సీపీలో విశ్వసనీయ నాయకుల్లో ఒకరిగా ఉంటూ పార్టీ పెద్దలు తనపై పెట్టుకున్న అంచనాలను అందుకుంటూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో మళ్లీ పార్వతీపురం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారు. 

ఇప్పటికే ఈ నియోజకవర్గానికి సంబంధించి వైసీపీలో వర్గపోరు నడుస్తోంది. మాజీ సమన్వయకర్త జమ్మాన ప్రసన్నకుమార్, ప్రస్తుత ఇంచార్జ్ అలజంగి జోగారావులు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడుతున్నారు. 

గత ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని మరీ రాజకీయాల్లో దిగారు జమ్మాన ప్రసన్నకుమార్ స్వల్ప ఓట్లతోనే టీడీపీ అభ్యర్థి బొబ్బిలి చిరంజీవి చేతిలో ఓటమి చెందారు. ఆ తర్వాత పార్టీని బలోపేతం చెయ్యడంలో కీలక పాత్ర పోషించారు. 

ఏ నియోజకవర్గంలో చెయ్యని కార్యక్రమాలు చేపట్టారు. అలాంటి సమయంలో వైఎస్ జగన్ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతల నుంచి జమ్మాన ప్రసన్నకుమార్ ను తప్పించారు. అలజంగి జోగారావును సమన్వయకర్తగా నియమించారు. 

ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకుని పార్టీ కోసం అలుపెరగని పోరాటం చేసిన తనను కాదని అలజంగి జోగారావుకు ఇవ్వడంపై జమ్మాన గుర్రుగా ఉన్నారు. ఇప్పటికే ఇద్దరు కొట్టుకుంటున్న నేపథ్యంలో ఆమెకు సీటు దక్కుతుందా అన్న సందేహంన నెలకొంది.  

ఆమె 2019 ఎన్నికల బరిలో నిలవాలని కోరుకుంటున్న విషయాన్ని మంత్రి సుజయ్ కృష్ణ రంగరావు పసిగట్టేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సుజయ్ కృష్ణ  రంగారావుతో టచ్ లో ఉండేవారు జయమణి. స్నేహ భావం ఉండటంతో ఆమెను టీడీపీలోకి తీసుకువచ్చే బాధ్యత తనదని చంద్రబాబు వద్ద మంత్రి సుజయ్ కృష్ణ రంగరావు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.  

బొబ్బిలి నియోజకవర్గం టికెట్ తనకు ఇవ్వడంతో పాటు పార్వతీపురం టీడీపీ టికెట్ జయమణికి ఇస్తే రెండు నియోజకవర్గాలను గెలిపించి బహుమతిగా ఇస్తానని కూడా చంద్రబాబుకు చెప్పుకొచ్చారట సుజయ్. పార్వతీపురం నియోజకవర్గం నుంచి జయమణి గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేపై పెరుగుతున్న ప్రజావ్యతిరేకతను ప్రతిపక్ష వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకోకముందే, ఆ స్థానంలో వైసీపీ నుంచి జయమణిని బరిలో దింపకముందే, ఆమెను టీడీపీలో చేర్చుకుని టీడీపీ టికెట్ ఇస్తే మంచిదని ఇప్పటికే జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. 

వైసీపీలో ఉన్నా, పార్టీలకు అతీతంగా అందరితో మంచి సంబంధాలు ఉన్న జయమణి అభ్యర్థిత్వంపై జిల్లా ఇంచార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు, సుజయ్ కృష్ణ రంగారావు, విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు, పార్వతీపురం ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ లు సంతృప్తి వ్యక్తంచేస్తున్నట్లు తెలుస్తోంది.  

టీడీపీ ముందస్తు వ్యూహంలో భాగంగా సుజయ్ కృష్ణ రంగారావు నేరుగా రంగంలోకి దిగి జయమణి పార్వతీపురం టీడీపీ అభ్యర్ధిగా బరిలో దించితే వైసీపీ, ఓ గెలుపు గుర్రాన్ని కోల్పోయినట్లేననడంలో ఎలాంటి సందేహం లేదు. టీడీపీ అలాంటి ఎత్తులు వెయ్యకముందే జగన్ జాగ్రత్త పడాలని లేని పక్షంలో పార్టీకి గొప్ప దెబ్బ తగిలే అవకాశం ఉందని కొందరు కార్యకర్తలు చెప్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios