ఆకివీడు: పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ప్రమాదం తప్పింది. 

పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సోమవారం నాడు  పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత గ్రామాల్లో లోకేష్ పర్యటిస్తున్నారు.పార్టీ నేతలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజుతో కలిసి ఆయన ట్రాక్టర్ పై వెళ్లాడు. ఈ క్రమంలో లోకేష్ ట్రాక్టర్ నడుపుతున్న సమయంలో ట్రాక్టర్ అదుపు తప్పింది.

ట్రాక్టర్ సమీపంలోని కాల్వవైపుకు ఒరిగింది. వెంటనే తేరుకొని పార్టీ నేతలు ట్రాక్టర్ ను అదుపు చేశారు.  ఆ తర్వాత లోకేష్ పర్యటన కొనసాగింది.

పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవాళ నారా లోకేష్ పర్యటనకు మాజీ మంత్రి పీతల సుజాత డుమ్మా కొట్టారు. పార్టీ అధిష్టానం ఇటీవల ప్రకటించిన కమిటీల్లో మాజీ మంత్రి సుజాతకు చోటు దక్కలేదు. దీంతో ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సుజాత డుమ్మా కొట్టారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. పార్టీని బలోపేతం చేసే ఉద్దేశ్యంతో చంద్రబాబునాయుడు పార్టీ కమిటీల్లో చోటు కల్పించారు.