అమరావతి: తాము  అధికారంలో ఉన్న కాలంలో  రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చెప్పారు. ఏపీలో బీహార్ పాలన సాగుతోందని ఆయన చెప్పారు.

ప్రత్యర్థుల చేతుల్లో హత్యకు గురైన  ఉమా యాదవ్ కుటుంబాన్ని బుధవారం నాడు టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  సుమారు 130 మంది కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారన్నారు.  ఈ దాడులను నిరసిస్తూ రేపు డీజీపీని కలిసి వినపతిపత్రాన్ని సమర్పించనున్నట్టు ఆయన తెలిపారు.

రాజకీయ హత్యలు జరుగుతోంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారని  ఆయన ప్రశ్నించారు. శాంతి భద్రతలు  దిగజారుతున్నాయన్నారు. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.  కార్యకర్తలు  ఎవరూ కూడ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని ఆయన కోరారు.

ప్రజా వేదిక అక్రమ కట్టడం కాదన్నారు.  కరకట్టకు 100 మీటర్ల దూరంలో  ప్రజా వేదికను నిర్మించారని ఆయన గుర్తు చేశారు. 2017‌కు ముందు నిర్మించిన కట్టడాలన్నీ కూడ అక్రమ నిర్మాణాలు కావని  ఆయన చెప్పారు.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పును చదవాలని  లోకేష్ అధికార పార్టీ నేతలకు సూచించారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీకి మెజారిటీ వచ్చిన గ్రామాల్లో గోడలు కడుతున్నారన్నారు.