అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ నాయకులతో కలిసి మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఘనంగా నిర్వహించారు.  

అనంతపురం: మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు చేతుల మీదుగా పురుడు పోసుకొన్న మంచి రాజకీయ వ్యవస్థే తెలుగుదేశమని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు అభివర్ణించారు. అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ నాయకులతో కలిసి కాలవ ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కాలవ మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ పుట్టక పోయి ఉంటే ఈ రోజు బడుగు, బలహీన వర్గాలకు నిజమైన రాజకీయ స్వేచ్ఛ ఉండేది కాదని అన్నారు. పేదలకు నిజమైన రాజకీయ వేదికగా సామాన్యులను అసామాన్యులుగా తీర్చిదిద్దే అద్భుత శక్తిగా తెలుగుదేశం పార్టీ అవిర్భవించి నేటితో 39ఏళ్ళు పూర్తయ్యాయన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి ఎన్టీ రామారావు తరువాత చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తిరుగులేని శక్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతోందన్నారు.

read more పవన్ కల్యాణ్ తిరుగులేని నాయకుడా..? ఆ సినిమాకు ముగింపు పలకాలి: మాజీ మంత్రి పిలుపు

ఒక్క చాన్స్ పేరుతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు స్వేచ్ఛ లేకుండా చేసిందన్నారు కాలవ. కొంతమంది గుత్తాధిపత్యం కింద వైసిపి ప్రభుత్వం, రాష్ట్రం నడుస్తోందన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని, ఇలాంటి ప్రమాదం నుండి రాష్ట్రాన్ని కాపాడే శక్తి ఒక్క చంద్రబాబుకె ఉందన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ బాగుపడాలన్నా, అభివృద్ధి పథంలో ముందుకు నడవాలన్నా, మళ్లీ బడుగు, బలహీన వర్గాలకు అధికారంలో నిజమైన భాగస్వామ్యం కలగాలన్నా తిరిగి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ప్రతి కార్యకర్త మళ్లీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఈ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడానికి రాజకీయ పోరాటం చేయడానికి కంకణ బద్ధులు కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు మాజీ మంత్రి కాలవ.