ఫిరాయింపు ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డి మృతివల్ల అనివార్యమైన ఉపఎన్నికల్లో టిడిపికి చాలా కష్టాలే ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఫిరాయింపు మంత్రుల రూపంలో. నంద్యాల నియోజవకర్గం ఓటర్లలో రెడ్లు, బలిజ, ముస్లిం ఓట్లు చాలా కీలకం. అందుకనే చంద్రబాబునాయుడు ఏం చేసారంటే ఏ సామాజికవర్గం ఓట్లను ఆకట్టుకునేందుకు ఆయా సామాజికవర్గానికి చెందిన మంత్రులకు బాధ్యతలు అప్పజెప్పారు. అందులో భాగంగానే ఫిరాయింపు మంత్రులైన అమరనాధరెడ్డి, ఆదినారాయణరెడ్డిని నంద్యాలకు పంపారు. ఇక్కడే టిడిపికి సమస్య మొదలైంది.

మంత్రులిద్దరూ నియోజకవర్గంలో ఎక్కడ ప్రచారానికి వెళ్లినా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ప్రచారానికి వెళ్ళిన వీరిద్దిరినీ ఎక్కడికక్కడ జనాలు నిలదీస్తున్నారు. అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డిని కూడా అదే విధంగా జనాలు ఓ ఆటాడుకుంటున్నారు లేండి. తనకు ఓటేయమని అభ్యర్ధి అడగ్గానే, ‘ఎందుకు ఓటేయాలో చెప్ప’మని జనాలు నిలదీసిన సంగతి అందరూ చూసిందే. వైసీపీ తరపున గెలిచిన భూమానాగిరెడ్డి టిడిపిలోకి ఫిరాయించటాన్ని జనాలు అంగీకరించలేదన్న విషయం స్పష్టమవుతోంది.

ఇపుడదే నియోజకవర్గంలో ఉపఎన్నిక రావటంతో టిడిపికి ఇబ్బంది మొదలైంది.  ఒకవైపు అభ్యర్ధిని, ఇంకోవైపు ఫిరాయింపు మంత్రులను జనాలు నిలదీస్తున్న విషయం బయటకు పొక్కడంతో చంద్రబాబుకు ఏం చేయాలో అర్ధం కావటం లేదు. మరో ఫిరాయింపు మంత్రి భూమా అఖిలప్రియను మాత్రం ఎవరు నిలదీయలేదు లేండి. ఆ విషయంలో అఖిల జాగ్రత్త పడినట్లే ఉంది. ఎందుకంటే, అభ్యర్ధితో విడిగా ప్రచారానికి పోకుండా చిన్నపాటి బహిరంగసభలకు మాత్రమే విడిగా హాజరవుతున్నారు.

ఇటువంటి పరిస్ధితిల్లోనే ఫిరాయింపు మంత్రులను ప్రచారం నుండి వచ్చేయమని చెప్పలేక, వారితో ప్రచారం చేయించలేక చంద్రబాబు బాగా ఇబ్బంది పడుతున్నారు. వీరిద్దరిలోనూ ఆదినారాయణరెడ్డితో మరీ సమస్యలు ఎక్కువుగా ఉందట. ఏందుకంటే, ఆమధ్య కర్నూలు జిల్లాకే చెందిన ‘కేశవరెడ్డి విద్యాసంస్ధల’ అధినేత కేశవరెడ్డి విద్యార్ధుల తల్లి, దండ్రులనుండి భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించారు. తిరిగి ఇవ్వకుండా మోసం చేసారు.

కేశవరెడ్డిపై చీటింగ్ కసు నమోదైంది. అసలు, కేశవరెడ్డిని కేసులో నుండి తప్పించేందుకే నారాయణరెడ్డి పార్టీ ఫిరాయించారని ప్రచారంలో ఉంది. ఎందుకంటే, కేశవరెడ్డి-ఆదినారాయణరెడ్డి స్వయంగా వియ్యంకులు కాబట్టి. సుమారు రూ. 800 కోట్ల స్కాం అది. స్కాంలో వేలాదిమంది మోసపోయారు. కేశవరెడ్డి ప్రస్తుతం జైలులో ఉన్నప్పటికీ ముందు తమ డబ్బు తమకు ఇప్పించిన తర్వాతే ఓట్లు అడగటానికి రమ్మంటూ జనాలు ఆదినారాయణరెడ్డిపై మండిపడుతున్నారు.