ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. ఏపీ సీఎం చంద్రబాబుకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. సీనియర్ నేతలు అనుకున్నవారంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే కొందరు టీడీపీని వీడి వైసీపీలో చేరగా..తాజాగా మరో నేత ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. జగన్ తో భేటీ కూడా అయ్యారు. త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం జగన్ విశాఖ జిల్లా అనకాపల్లిలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా... టీడీపీ నేత, చోడవరం మాజీ ఎమ్మెల్యే గూనూరు మిలట్రీనాయుడు గురువారం అనకాపల్లి మండలం దర్జీనగర్‌ వద్ద వైఎస్‌ జగన్‌ బస చేసిన ప్రదేశంలో కలిశారు. దాదాపు ఆయనతో అరగంట పాటు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా  మిలట్రీనాయుడు ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు .

 అనంతరం  మిలట్రీ నాయుడు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని అన్నారు.కాంగ్రెస్ తరుపున, ఎన్టీఆర్ హయాంలో టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన తాను.. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డితో ఉన్న పరిచయాల కారణంగా ఆయన తనయుడు  జగన్‌మోహన్‌రెడ్డిని కలిసినట్టు చెప్పారు. కాగా ఇప్పటికే తన కుమారుడు రామచంద్రనాయుడు వైయస్సార్సీపీ లో ఉన్నట్టు చెప్పారు.