విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరావు. అమరావతిని ఘోస్ట్ సిటీగా మార్చేశారంటూ ధ్వజమెత్తారు. రాజధాని విషయంలో వైసీపీ నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. 

రాజధాని అమరావతి విషయంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెప్పుకొచ్చారు. రాజధాని కోసం రైతులను ఒప్పించేందుకు టీడీపీ ఎంతో శ్రమించిందన్నారు. తమపై నమ్మకంతో 33వేల ఎకరాల భూములను రైతులు ఇచ్చారని గుర్తు చేశారు. 

ఈనెల 28న రాజధాని ప్రాంతాల్లో మాజీ సీఎం చంద్రబాబు పర్యటిస్తారని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం పెయిడ్ ఆర్టిస్టులను రైతులుగా చూపించి మాట్లాడిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబును అడ్డుకుంటామని పెయిడ్ ఆర్టిస్టులు డ్రామాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. 

చంద్రబాబు అమరావతి పర్యటనకు రైతుల నుంచి చుక్కెదురు

రాజధాని ప్రాంతంలో అవినీతి జరిగిందని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ వైసీపీ నేతలు పదేపదే ఆరోపణలు చేస్తున్నారని మరి ఎందుకు బయటపెట్టలేకపోతున్నారని నిలదీశారు. 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6నెలలైనా ఇప్పటి వరకు రాజధాని భూముల్లో జరిగిన అవినీతిని ఎందుకు బట్టభయలు చేయలేకపోతున్నారని నిలదీశారు. రాజధాని భూముల్లో వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారానికి వివరణ ఇవ్వడంతోపాటు వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకే పర్యటిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. 

తెలుగుదేశం పార్టీపైనా, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఉన్న కక్షతో రాజధానిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారంటూ బోండా ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. రాజధానిపై వైసీపీ ప్రభుత్వం యెుక్క వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.  

మంత్రి బొత్స సత్యనారాయణ సంబంధం లేకుండా మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. రాజధానిపై మళ్లీ కమిటీలు ఎందుకు వేశారో చెప్పాలని ప్రశ్నించారు. జగన్ మొండి వైఖరి తో రాష్ట్రం తిరోగమనంలో ఉందన్నారు. 

రాజధాని వ్యవహారం వైసీపీ పార్టీ వ్యవహారం కాదని ప్రజల రాజధాని అని చెప్పుకొచ్చారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ సుప్రీంకోర్టులో కేసు వేయడంపై సెటైర్లు వేశారు.

చంద్రబాబుపైనా, టీడీపీపైనా గతంలో వేసిన కేసులపై కోర్టు మెుట్టికాయలు వేసిన విషయాన్ని గుర్తుందా అంటూ నిలదీశారు. అయినప్పటికీ ఆర్కే బుద్ధి తెచ్చుకోలే0దని తాము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని బోండా ఉమా మహేశ్వరరావు స్పష్టం చేశారు.