ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన ఇవాళ జరిగిన రాజంపేట పార్లమెంటరీ పార్టీ సమావేశంలో అపశృతి చోటుచేసుకుంది. ఈ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య గుండెపోటుకు గురయ్యారు. దీంతో అతన్ని వెంటనే పట్టణంలోని  ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతన్ని ఐసీయూలో మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. 

ఇటీవలే కడప జిల్లాకు చెందిన టిడిపి కాపు నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాజంపేట అసెంబ్లీ సీటును ఆశిస్తున్న బ్రహ్మయ్య కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అయితే తనకు సీటు రాకుండా జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, మంత్రి ఆదినారాయణ రెడ్డి అడ్డుకుంటున్నారని  ఆరోపించారు. 

వారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని రాజంపేట టికెట్ ఇప్పించుకునేందుకు వారిద్దరు తెరవెనుక మంతనాలు జరుపుతున్నట్లు ఆరోపించారు. సీనియారిటీ, పార్టీకోసం కష్టపడే నాయకులకు జిల్లాలో గుర్తింపే లేకుండా పోయిందని బ్రహ్మయ్య ఆవేధన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 

ఈ క్రమంలోనే ఇవాళ కడప జిల్లా టిడిపి నాయకులతో రాజధాని అమరావతిలో చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఈ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన బ్రహ్మయ్య తీవ్ర ఒత్తిడితో గుండె పోటుకు గురయ్యారు.